బహుజన తెలంగాణే లక్ష్యం: కవిత

  • నిజామాబాద్‌లో పాంచజన్య సంకల్ప సభ
  • కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంపై పిలుపు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై విమర్శలు

నిజామాబాద్, ఆగస్టు 31 (డిజైనర్ టెక్ గురు ప్రతినిధి):
తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిజామాబాద్ ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్‌లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సభలో పాల్గొన్న పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బంగారు తెలంగాణ కంటే బహుజన తెలంగాణ అవసరమని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే తన లక్ష్యమని, పదవుల కోసం కాకుండా ప్రజల కోసం కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించానని చెప్పారు. తెలంగాణ ఉద్యమం కోసం వేలాది మంది యువత ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేసిన ఆమె, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సాధారణ ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పులు రాలేదని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ ప్రజలు తనకు ఎప్పుడూ అండగా నిలిచారని, ఎంపీగా, ఎమ్మెల్సీగా అవకాశాలు ఇచ్చారని గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు మరోసారి ప్రజల ఆశీర్వాదం కోరుతూ ముందుకు వస్తున్నానని తెలిపారు.
తనపై జరిగిన రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ, ఎలాంటి తప్పు చేయకుండానే జైలుకు పంపించారని, నాలుగేళ్లపాటు దర్యాప్తు సంస్థల ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ధైర్యం కోల్పోలేదని కవిత అన్నారు. సొంత ఊరికి వచ్చినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని చెప్పినా, తాను పిరికివాళ్లలో కాదని స్పష్టం చేశారు. తనకు అండగా నిలిచిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కవిత, వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రైతు భరోసా, పెన్షన్లు, మహిళలకు ఆర్థిక సహాయం వంటి కీలక హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడాల్సిన ప్రతిపక్షం కూడా మౌనంగా ఉండటం ఆశ్చర్యకరమని, ప్రజా సమస్యలపై ప్రశ్నించని నాయకత్వాన్ని ప్రజలు గమనించాలని అన్నారు.
బీఆర్ఎస్ నాయకత్వంపై కూడా విమర్శలు గుప్పించిన కవిత, కొందరు నేతలు ప్రజల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో పలువురు నాయకుల తీరును ప్రస్తావిస్తూ, తన రాజకీయ జీవితంలో ఎదురైన అనుభవాలను సభలో వివరించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని, నిజామాబాద్ జిల్లాలో ఐదు స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యమని ప్రకటించారు. పాంచజన్య సంకల్ప సభ ద్వారా ఐదు ప్రధాన అంశాలతో ముందుకు వెళ్తున్నామని కవిత వెల్లడించారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, యువతకు పరిశ్రమల స్థాపనకు రుణాలు, సామాజిక న్యాయం, భూమిలేని పేదలకు భూమి పంపిణీ వంటి అంశాలను ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించారు. తెలంగాణలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం నిజమైన పురోగతి సాధిస్తుందని పేర్కొంటూ, బహుజన తెలంగాణ నిర్మాణానికి ప్రజల మద్దతు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *