తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు

ఈ వార్తను షేర్ చేయండి:

బీసీల గొంతుకను అణచివేసే కుట్రేనా?.. సమగ్ర విచారణకు డిమాండ్

  • నుజ్జునుజ్జయిన ఫార్చునర్ కారు.. పాదయాత్రలో ఉండటంతో మల్లన్నకు తప్పిన ప్రమాదం
  • గాయపడిన దంపతుల పరిస్థితి విషమం.. ప్రమాదంపై అనుమానాలు

మోత్కూరు, నవంబర్ 13 (తెలంగాణ గర్జన): యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామ సమీపంలో శుక్రవారం తీన్మార్ మల్లన్న పాదయాత్ర సందర్భంగా తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోత్కూరు నుంచి అనాజిపురం మీదుగా తిరుమలగిరి వైపు పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ (టీఎస్ 30 టీ 7596) మల్లన్న కాన్వాయ్‌లోని ఫార్చునర్ కారు (టీఎస్ 30 ఎల్ 444)ను బలంగా ఢీకొట్టింది. చౌటుప్పల్ మండలం జైకేసారానికి చెందినదిగా చెబుతున్న ఆ లారీ ఢీకొట్టడంతో ఫార్చునర్ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాద సమయంలో మల్లన్న ఫార్చునర్ కారులో కాకుండా పాదయాత్రలో ముందుకు నడుస్తుండటంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

దంపతులకు తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

ఈ ప్రమాదంలో టీఎస్ 04 8919 నంబర్ గల కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. తిరుమలగిరికి చెందిన మేడబోయిన శ్రీనాథ్, ఆయన భార్య చందనతో పాటు వారి రెండేళ్ల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్‌లో నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ సురేష్‌కు కూడా గాయాలు కావడంతో మరో వాహనంలో ఆసుపత్రికి తరలించారు. తీన్మార్ మల్లన్నకు చెందిన ఫార్చునర్ కారులో ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడినట్లు సమాచారం. ప్రమాదంలో శ్రీనాథ్, చందన దంపతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లారీ ఢీకొట్టిన తీవ్రతకు ఫార్చునర్ కారు నుజ్జునుజ్జు కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది.

ప్రమాదమా.. పథకం ప్రకారం జరిగిన కుట్రా?

తీన్మార్ మల్లన్న ప్రయాణించే వాహనాన్ని లారీ ఢీకొట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. బీసీల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం గళమెత్తుతున్న మల్లన్నను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రమాదానికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ మరో కారులో పరారయ్యాడని, ఆ వాహనం ముందుగానే అక్కడ సిద్ధంగా ఉంచారని వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.

బీసీల గొంతుకపై హత్యాయత్నమా?.. సీనియర్ జర్నలిస్టు గోపాల బాలరాజు అనుమానాలు

ఈ ఘటనపై సీనియర్ జర్నలిస్టు గోపాల బాలరాజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల పక్షాన పాలకులను ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్న గొంతును అణచివేసేందుకు జరిగిన కుట్రగా ఈ ప్రమాదాన్ని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన బెల్లి లలిత, మారోజు వీరన్న, కోనాపురి సాంబశివుడు వంటి ఉద్యమకారుల చరిత్రను గుర్తుచేశారు. గతంలో సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకులు హింసకు బలయ్యారని, ఇప్పుడు బీసీల రాజ్యాధికార సాధన కోసం ఉద్యమిస్తున్న మల్లన్నకు ఎదురైన ఈ ఘటనపై కూడా అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు.

లారీ డ్రైవర్ పరారీపై అనుమానాలు.. సూత్రధారులెవరు?

ప్రమాదం జరిగిన సమయంలో మల్లన్న కారులో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని, అయితే అమాయకులు తీవ్రంగా గాయపడటం బాధాకరమని సీనియర్ జర్నలిస్ట్ గోపాల బాలరాజు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ మరో వాహనంలో వెళ్లిపోయాడనే ఆరోపణల్లో నిజమెంత? ఆ వాహనం ఎవరిది? డ్రైవర్ ఎక్కడికి వెళ్లాడు? ప్రమాదం వెనుక ఎవరైనా ఉన్నారా? అనే ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తీన్మార్ మల్లన్న రాష్ట్ర డీజీపీని కలవనున్నట్లు సమాచారం. మల్లన్నకు తగిన భద్రత కల్పించడంతో పాటు ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

బీసీల ఆత్మగౌరవ పోరాటాలను ఆపలేరు

ఈ ఘటనను కేవలం ఒక రోడ్డు ప్రమాదంగా మాత్రమే చూడకుండా అన్ని కోణాల్లో విచారించాలని గోపాల బాలరాజు అభిప్రాయపడ్డారు. బీసీల రాజకీయ చైతన్యం పెరుగుతున్న సమయంలో వారి హక్కుల కోసం పోరాడుతున్న నాయకుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని, రాజ్యాధికార ఆకాంక్షను ఎలాంటి బెదిరింపులతోనూ అణచివేయలేరని పేర్కొన్నారు. ఒక మల్లన్నను అడ్డుకున్నా వేలాది మంది మల్లన్నలు ఉద్యమంలో ముందుకు వస్తారని, సామాజిక న్యాయం సాధించే వరకు బడుగు, బలహీన వర్గాల పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *