అందరి బంధువు..అందరికీ ఆప్తుడు…కొత్త పాండు గౌడ్ ఇకలేరు…
మాజీ ఎంపీటీసీ సభ్యుడు, కె.పి. డెవలపర్స్ అధినేత మృతి
మాడ్గుల, నవంబర్ 08 (తెలంగాణ గర్జన): మాడ్గుల మండలం నర్సాయపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, కె.పి. డెవలపర్స్ అధినేత కొత్త పాండు గౌడ్ ఆదివారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మరణంతో నర్సాయిపల్లి గ్రామంతో పాటు మొత్తం మండలంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని సాగర్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న బృంగీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందిన పాండు గౌడ్, వ్యాపార రంగంలోనూ కె.పి. డెవలపర్స్ అధినేతగా కొనసాగారు. నర్సాయిపల్లి గ్రామ సర్పంచ్ కొత్త జ్యోతిగౌడ్ భర్తగా, గౌతమ్ తండ్రిగా కుటుంబానికి అండగా ఉన్న ఆయన ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులకు తీరని లోటుగా మారింది. రాజకీయాలకు అతీతంగా అందరితో ఆప్యాయంగా మెలుగుతూ, కలుపుగోలుతనంతో వ్యవహరించే వ్యక్తిగా పాండు గౌడ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన మరణవార్త తెలుసుకున్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పాండు గౌడ్ ఆకస్మిక మృతి మాడ్గుల మండల రాజకీయ, సామాజిక వర్గాలకు తీరని లోటుగా మిగిలింది.




