అప్పారెడ్డిపల్లి – కొలుకులపల్లి రోడ్డు పై డీజే లేకుండానే డాన్స్ చేయొచ్చు
- పండుగవేళ అత్తగారింటికి వెళ్లాలన్నా అల్లుళ్ళకు జంకే పరిస్థితి!
- అప్పారెడ్డిపల్లి–కొలుకులపల్లి రహదారిపై గుంతల రాజ్యం… ప్రయాణమంటేనే నడుములు గుల్ల!
- 15 ఏళ్ల క్రితం వేసిన రోడ్డుకు మరమ్మతులేవీ? ఆ రెండున్నర కిలోమీటర్ల దారిలో నిత్యం నరకయాతన
మాడ్గుల,అక్టోబర్ 17 (తెలంగాణ గర్జన):
“నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేతపా.. డుగ్గుడుగ్గు డుగ్గుడుగ్గు అని.. అందాల దునియానే చూపిస్తాపా!” అంటూ బుల్లెట్పై దర్జాగా పాటలు పాడుకుంటూ ప్రయాణం చేయాల్సిన చోట.. ఇప్పుడు ఆ పాటలు పాడే ధైర్యమే లేకుండా పోయింది! అందాల దునియా సంగతి దేవుడెరుగు.. గుంతల్లో బండి దూకితే ఇంటికి చేరేసరికి నడుములు టింగుమంటున్నాయి! కారు, బైకు, ఆటో.. ఏ వాహనమైనా సరే, డీజే అవసరం లేకుండానే కుదుపులతో ఆటోమేటిక్ డ్యాన్స్ చేయాల్సిందే! ఇది సినిమా సన్నివేశం కాదు.. అప్పారెడ్డిపల్లి–కొలుకులపల్లి గ్రామాల మధ్య రహదారిపై నిత్యం ప్రయాణించే ప్రజల వాస్తవ పరిస్థితి. తెలంగాణ రాజధాని హైదరాబాద్కు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో, మాడ్గుల మండల కేంద్రానికి సుమారు ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న ఈ రహదారి దుస్థితి చూస్తే గ్రామీణ మౌలిక సదుపాయాలపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పారెడ్డిపల్లి నుంచి కొలుకులపల్లి వరకు, నాగిళ్ల నుంచి కొలుకులపల్లి రహదారిని కలిసే ప్రాంతం వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల మేర ఉన్న ఈ దారిలో మొదటి మూడున్నర కిలోమీటర్లు కొంతవరకు ప్రయాణించదగిన స్థితిలో ఉన్నా, మిగిలిన రెండున్నర కిలోమీటర్లు మాత్రం వాహనదారులకు పరీక్షగా మారుతున్నాయి.

గుంతలు, రాళ్లు.. అడుగడుగునా ప్రమాదమే!
రోడ్డుపై తారు ఆనవాళ్లు కనిపించని ప్రాంతాలు, బయటపడిన కంకర రాళ్లు, లోతైన గుంతలు, పగుళ్లు.. ఇవన్నీ కలిసి ప్రయాణాన్ని ప్రమాదకరంగా మారుస్తున్నాయి. ఒకవైపు రహదారి ఇరుకుగా ఉండటం, మరోవైపు రోడ్డుకు ఆనుకుని పెరిగిన కంపచెట్లు వాహనదారులకు మరింత ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఎదురుగా పెద్ద వాహనం వస్తే మరో వాహనం సురక్షితంగా పక్కకు వెళ్లేందుకు తగినంత స్థలం ఉండటం లేదని స్థానికులు చెబుతున్నారు. కొన్ని మలుపులు దాదాపు 90 డిగ్రీల కోణంలో ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాన్ని ముందుగానే గుర్తించడం, సురక్షితంగా మలుపు తిరగడం కష్టమవుతోంది. రోడ్డుపై ప్రయాణించే ప్రతి కిలోమీటరూ అప్రమత్తతతో ఉండాల్సిందే. గుంతలను తప్పించబోతే ఎదురుగా వచ్చే వాహనాన్ని ఢీకొట్టే ప్రమాదం.. పక్కకు వెళ్ళబోతే కంపచెట్లను తాకే పరిస్థితి! ద్విచక్ర వాహనదారులు కుదుపులతో అవస్థలు పడుతుండగా, ఆటోలు, కార్లలో ప్రయాణించేవారికీ ఇదే ఇబ్బంది. వాహనాల మరమ్మతుల ఖర్చులు పెరుగుతున్నాయని, ప్రయాణ సమయం కూడా ఎక్కువవుతోందని ఈ రోడ్డును తరచుగా వినియోగించే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారిని సుమారు 15 ఏళ్ల క్రితం నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంతకాలం గడిచినా రహదారికి సమగ్ర మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే ప్రస్తుత దుస్థితి ఏర్పడిందని వారు అంటున్నారు.
ఆరు కిలోమీటర్ల దారిని తప్పించుకోవాలంటే మరో ఆరు కిలోమీటర్లు!
అప్పారెడ్డిపల్లి, దొడ్లపహాడ్ గ్రామాల ప్రజలకు మాల్, హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే రోడ్డు కారణంగా కొందరు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. మాడ్గుల మీదుగా వెళ్లాలంటే సుమారు ఆరు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. అదనపు దూరమంటే కేవలం సమయం వృథా కావడమే కాదు, పెరిగిన ఇంధన ఖర్చు, వాహనాలపై అదనపు భారం, ప్రయాణికుల శ్రమ, పరోక్షంగా పెరిగే కాలుష్యం కూడా. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చినా, వ్యవసాయ పనుల కోసం రాకపోకలు సాగించాల్సి వచ్చినా ఈ రహదారి సమస్య ప్రజలకు భారంగా మారుతోంది. గతంలో అప్పారెడ్డిపల్లి కొలుకులపల్లి రోడ్డు బాగున్నప్పుడు చంద్రాయన్పల్లి, కలకొండ ప్రాంతాల ప్రజలు కూడా ఈ మార్గం గుండా మాల్, హైదరాబాద్ వైపు ప్రయాణించేవారని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఒకప్పుడు అనేక గ్రామాలకు ఉపయోగకరంగా ఉన్న రోడ్డు, ఇప్పుడు దాని దుస్థితి కారణంగా ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.54 లక్షల టెండర్ ఏమైంది?
ఈ రహదారి నిర్మాణం లేదా మరమ్మతుల కోసం సుమారు రెండేళ్ళ క్రితం రూ.54 లక్షలతో టెండర్ ప్రక్రియ చేపట్టగా, రహదారి పరిస్థితిని చూసిన కాంట్రాక్టర్ మొదట్లోనే పనుల నుంచి తప్పుకున్నారని, అనంతరం టెండర్ రద్దయిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియకు సంబంధించిన అధికారిక వివరాలు, టెండర్ రద్దుకు గల కారణాలు సంబంధిత శాఖ అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి చూస్తే, టెండర్ ప్రక్రియ ఏ దశలో నిలిచిపోయిందన్నది కేవలం పరిపాలనా అంశం మాత్రమే కాదు. రహదారిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గ్రామాల ప్రజలకు పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నదే అసలు ప్రశ్న. నిధులు, టెండర్లు, పరిపాలనా ప్రక్రియల మధ్య ప్రజల ప్రయాణ కష్టాలు మాత్రం కొనసాగకూడదని స్థానికులు కోరుతున్నారు.
అత్తగారింటికి వెళ్లాలన్నా అల్లుళ్లకు భయమే!

అప్పారెడ్డిపల్లి, దొడ్లపహాడ్ గ్రామాల్లోని అత్తగారింటికి వెళ్లాలనుకునే అల్లుళ్లు సైతం ఈ రోడ్డు గురించి ఆలోచించి జంకుతున్నారని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అత్తగారింటి ఆతిథ్యం కంటే ముందుగా రహదారి కుదుపులనే భరించాల్సి వస్తోందని, ప్రయాణం ముగిసేసరికి ఒళ్లంతా అలసటగా మారుతోందని చమత్కరిస్తున్నారు. అయితే ఈ వ్యంగ్యం వెనుక ఉన్నది కేవలం నవ్వు కాదు.. ప్రజలు అనుభవిస్తున్న అసౌకర్యంపై ఆవేదన. బంధువుల ఇళ్లకు వెళ్లాలన్నా, వ్యవసాయ పనులకు బయలుదేరాలన్నా, నిత్యావసరాల కోసం ప్రయాణించాలన్నా రహదారి దుస్థితి అడ్డంకిగా మారితే అది గ్రామీణ జీవనంపై పడుతున్న భారమే.
ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీ.. పల్లెల్లో మాత్రం రోడ్ల కోసం ఎదురుచూపులా?
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఎనమది దశాబ్దాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా 12 సంవత్సరాలు గడిచాయి. ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి గురించి గొప్పగా మాట్లాడుతున్న ఈ కాలంలో.. గ్రామీణ ప్రజలు కనీస రహదారి సౌకర్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది? హైదరాబాద్లోని అభివృద్ధి చెందిన ప్రాంతాల రహదారులకు, రైతులు నివసించే గ్రామాల రహదారులకు మధ్య ఉన్న వ్యత్యాసం గ్రామీణ మౌలిక సదుపాయాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. మాడ్గుల మండల కేంద్రంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం స్వాగతించదగిన విషయమే. అయితే మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే రహదారులు కూడా ప్రయాణయోగ్యంగా ఉండాలి. పెద్ద భవనాలు, బస్టాండ్లు, ఇతర అభివృద్ధి పనులతోపాటు గ్రామీణ రహదారుల నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి చేరినట్లవుతుంది. అప్పారెడ్డిపల్లి–కొలుకులపల్లి రహదారిపై రైతులు, కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు, ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు ఇలా అనేక వర్గాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వారి రోజువారీ ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండటం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత. రహదారి సమస్యను చిన్న సమస్యగా పరిగణించకుండా, ప్రజల భద్రతకు సంబంధించిన అంశంగా చూడాల్సిన అవసరం ఉంది.
అధికారులూ.. ఇకనైనా స్పందించండి!
పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు ఈ రహదారి సమస్యపై తక్షణమే స్పందించాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ప్రజల డిమాండ్లు:
- తక్షణ ఉపశమనం: గుంతలను గుర్తించి వెట్మిక్స్తో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, గుంతల వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించాలి.
- శాశ్వత పరిష్కారం: రహదారి పరిస్థితిని సాంకేతికంగా పరిశీలించి, నాణ్యతతో కూడిన సమగ్ర పునర్నిర్మాణం లేదా అవసరమైన మేరకు పునరుద్ధరణ చేపట్టాలి.
- రహదారి వెడల్పు: ఎదురెదురుగా వాహనాలు సురక్షితంగా వెళ్లేందుకు వీలుగా రహదారి వెడల్పు పెంచే అవకాశాలను పరిశీలించాలి.
- ప్రమాదకర మలుపుల సవరణ: ఎదుటి వాహనం కనపడకుండా వుండే మలుపులను సరిచేసి, అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
- పనులపై స్పష్టత: గతంలో చేపట్టినట్లు చెబుతున్న రూ.54 లక్షల టెండర్ ప్రక్రియ వివరాలను వెల్లడించి, పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో ప్రజలకు తెలియజేయాలి.
ప్రజలకు కావాల్సింది హామీలతో సరిపెట్టడం కాదు.. ప్రయాణ కష్టాలకు ముగింపు పలికే కార్యాచరణ. గుంతలు లేని, ప్రమాదాలు తగ్గించే, గ్రామాలను కలిపే రహదారి వారి కనీస హక్కు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అప్పారెడ్డిపల్లి–కొలుకులపల్లి రహదారికి శాశ్వత పరిష్కారం చూపుతారా? లేక ప్రజలు ఇదే గుంతల దారిలో మరికొంతకాలం నడుములు గుల్ల చేసుకుంటూ ప్రయాణించాల్సిందేనా? అన్నది వేచి చూడాలి.




