ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పిఎంఈజిపి) పథకం కొనసాగింపుపై స్పష్టత ఏదీ?

ఈ వార్తను షేర్ చేయండి:

పునః ప్రారంభం ఎప్పుడు? కొత్త యూనిట్లకు రుణాలు ఎప్పటినుండి? దరఖాస్తుదారులు ఎదురుచూపులకు తెరపడేదెప్పుడు?

మాడ్గుల, అక్టోబర్ 13 (తెలంగాణ గర్జన): నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2008లో ప్రారంభించిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పిఎంఈజిపి) మొన్న మార్చ్ 31 2026 వరకు కొనసాగింది, ఈ పథకం కొనసాగింపుపై ఇప్పుడు అనిశ్చితి నెలకొంది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పథకం కొనసాగింపుపై స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.

వెబ్‌సైట్ నవీకరించినా.. దరఖాస్తులకు అవకాశం ఎక్కడ?

పథకం కొనసాగుతుంది పరిశ్రమల శాఖా అధికారులు చెబుతున్న దానిలో భాగంగా వెబ్‌సైట్‌ను నవీకరించినప్పటికీ, పూర్తిస్థాయిలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాలేదని దరఖాస్తుదారులు చెబుతున్నారు. కొత్త దరఖాస్తులకు అవకాశం లేకపోవడంతోపాటు, పాత దరఖాస్తుల వివరాలు కూడా పూర్తిగా కనిపించడం లేదని వాపోతున్నారు. పథక మార్గదర్శకాలను పునఃపరిశీలించి ఆమోదించిన తర్వాతే కొనసాగింపు ఉంటుందని వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లు వారు చెబుతున్నారు.

బ్యాంకుల చుట్టూ తిరిగినా సమాధానం కరువు!

రుణం, సబ్సిడీపై ఆశలు పెట్టుకున్న దరఖాస్తుదారులు హైదరాబాద్‌లోని పరిశ్రమల శాఖ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా స్పష్టమైన సమాచారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం నుండి అందక పరిశ్రమల , బ్యాంకుల అధికారులకు సైతం సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. పథకం వస్తుందన్న నమ్మకంతో తమ సొంత డబ్బుతో వ్యాపార ఏర్పాట్లు ప్రారంభించినవారు ఇప్పుడు ఎటూ పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

పథకం ఎప్పుడు కొనసాగిస్తారు?

పిఎంఈజిపి పథకం కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు స్పష్టమైన ప్రకటన చేస్తుంది? కొత్త దరఖాస్తులకు ఎప్పుడు అవకాశం కల్పిస్తారు? పాత దరఖాస్తుల పరిస్థితి ఏమిటి? బ్యాంకులకు మార్గదర్శకాలు ఎప్పుడు జారీ చేస్తారు? అన్న ప్రశ్నలు దరఖాస్తుదారుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, పథకం కొనసాగింపుపై స్పష్టతనిచ్చి, అర్హులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *