కాంగ్రెస్ నేతల 2,006 ఎకరాల భూములపైన జీవో 134తో విచారణ జరపాలి

ఈ వార్తను షేర్ చేయండి:
  • బీఆర్ఎస్ నేతల భూములకే పరిమితమైన విచారణ ఎందుకు?
  • జీవో 134 ఆర్టికల్ 14కు విరుద్ధం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం: డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • సీఎం కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేతల భూముల వివరాలతో ప్రభుత్వానికి లేఖ

హైదరాబాద్, అక్టోబర్ 13 (తెలంగాణ గర్జన): తెలంగాణలో ప్రజా పాలన పేరుతో ప్రతీకార రాజకీయాలు సాగుతున్నాయని, అవినీతి, భూ వ్యవహారాలపై నిష్పక్షపాతంగ విచారణ జరపాల్సిన ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులనే లక్ష్యంగా చేసుకుంటోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. జీవో 134 కింద ఏర్పాటు చేసిన కమిటీ విచారణను బీఆర్ఎస్ నాయకుల భూములకే పరిమితం చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ నాయకులు, వారి అనుబంధ వ్యక్తులకు సంబంధించిన భూములపైన అదే జీవో కింద విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకులకు చెందినివిగా తాము పేర్కొంటున్న సుమారు 2,006 ఎకరాల భూముల వివరాలను కూడా జీవో 134 పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు లేఖ రాసినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదుపై ప్రభుత్వం స్పందించకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలను పక్కనపెట్టి.. రాజకీయ కక్ష సాధింపులా?

రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కంటే రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సాగునీటి వనరుల వినియోగం, పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసే అంశాలు, ఎల్‌నినో ప్రభావంపై చేసిన హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. మరోవైపు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. 22-ఏ నిషేధిత భూముల జాబితాపై శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలో, బీఆర్ఎస్ నాయకులు, వారి కుటుంబ సభ్యుల భూములపై విచారణ పేరుతో సెప్టెంబర్ 24, 2026న జీవో 134 అనుబందంగా తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ జీవో ద్వారా 13 జిల్లాల్లో భూముల వ్యవహారాలను పరిశీలించాలని నిర్ణయించినప్పటికీ, ఆచరణలో బీఆర్ఎస్ నేతల భూముల వివరాలపైనే ప్రధానంగా దృష్టి సారించారని ఆరోపించారు.కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నాయకుల భూములను 22-ఏ జాబితాతో అనుసంధానించి కమిటీకి అందించారని తెలిపారు. సంబంధం లేని వ్యక్తులను కూడా ‘అండ్ అసోసియేట్స్’ పేరుతో జాబితాలో చేర్చారని ఆరోపించారు. జీవోలో బీఆర్ఎస్ నాయకుల భూములనే విచారించాలని ఎక్కడా లేదని, అలాంటప్పుడు కాంగ్రెస్ నాయకుల భూములను ఎందుకు పరిశీలించడం లేదని ఆయన ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ నేతల భూముల వివరాలను కూడా పరిశీలించాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు గీతారెడ్డి, నైమిష రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, బొడ్డు వినోద్ కుమార్, బీర్ల ఐలయ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులకు సంబంధించిన భూములపైనా జీవో 134 కింద ఏర్పాటైన కమిటీ విచారణ జరపాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, మేడ్చల్–మల్కాజిగిరి, నారాయణపేట, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉన్నట్లు పేర్కొన్న భూముల వివరాలను కూడా విచారణ పరిధిలోకి తీసుకురావాలని కోరారు.

ఆయన విలేఖరుల సమావేశంలో ప్రస్తావించిన భూముల వివరాలు, ఆరోపణలు ఇవి:

  • రేవంత్ రెడ్డి: శేరిలింగంపల్లి పరిధిలోని సర్వే నంబర్ 127లో ఉన్న భూములపై విచారణ జరపాలని కోరారు.
  • గీతారెడ్డి: చౌటుప్పల్ మండలం మల్కాపురంలో సర్వే నంబర్ 646 కింద ఉన్నట్లు పేర్కొన్న 107 ఎకరాల భూముల వివరాలను పరిశీలించాలని అన్నారు.
  • నైమిష రెడ్డి, సత్యనారాయణ రెడ్డి: వెల్దండ మండలం కొట్రలో ఉన్నట్లు పేర్కొన్న 128 ఎకరాల భూములపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
  • తిరుపతి రెడ్డి: కోస్గి మండలం, నారాయణపేట ప్రాంతంలో ఉన్న భూములను పరిశీలించాలని కోరారు.
  • నైమిష రెడ్డి: కుత్బుల్లాపూర్‌లోని సర్వే నంబర్ 87 కింద ఉన్న రెండు ఎకరాల భూమి విలువ రూ.70–80 కోట్లు ఉంటుందని, దానిని సుమారు రూ.7 కోట్లకే కొనుగోలు చేసినట్లు ఆరోపించారు.
  • కొండల్ రెడ్డి: వెల్దండ, వంగూరు ప్రాంతాల్లో ఉన్నట్లు పేర్కొన్న భూములపై విచారణ జరపాలని కోరారు.
  • పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి: నాదర్‌గుల్‌లో సర్వే నంబర్ 613 కింద ఉన్నట్లు పేర్కొన్న 373 ఎకరాల భూముల వ్యవహారాన్ని పరిశీలించాలని అన్నారు.
  • హర్షా రెడ్డి: వట్టినాగులపల్లిలో సర్వే నంబర్లు 245, 259 కింద ఉన్నట్లు పేర్కొన్న 27 ఎకరాలు, పుప్పాలగూడలో ఉన్నట్లు చెప్పిన 14 ఎకరాల భూములపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
  • అల్వాల్ రెడ్డి: వెల్దండ మండలం కొట్ర గ్రామంలో ఉన్నట్లు పేర్కొన్న 48 ఎకరాల భూములను పరిశీలించాలని కోరారు.
  • అన్నం రమేష్ రెడ్డి: కల్వకుర్తి ప్రాంతంలోని ఎల్లికల్ గ్రామంలో ఉన్నట్లు పేర్కొన్న 58 ఎకరాల భూములపై విచారణ జరపాలని అన్నారు.
  • ఎస్‌ఏఎస్ ఇన్‌ఫ్రా: ఖాజాగూడలో 3 ఎకరాల 17 గుంటల భూమికి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని ఆరోపించారు.
  • ఖానామెట్: కరీజ్ ఖాతాకు సంబంధించిన 26 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని ఆరోపించారు.
  • బొడ్డు వినోద్ కుమార్: కొల్లూరులో ఉన్నట్లు పేర్కొన్న మూడు ఎకరాల భూమిని పరిశీలించాలని కోరారు.
  • గచ్చిబౌలి: 36 ఎకరాల భూములకు సంబంధించిన వ్యవహారాన్ని విచారణలోకి తీసుకురావాలని అన్నారు.
  • మహేశ్వరం: సుమారు 400 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
  • భువన్ ఇన్‌ఫ్రా: తుమ్మలూరులో ఉన్నట్లు పేర్కొన్న 25 ఎకరాల భూములపై విచారణ జరపాలని కోరారు.
  • కీసర–నాగారం: ఎస్సీలకు చెందిన భూములకు సంబంధించి సుమారు 41 ఎకరాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపించారు.
  • బీర్ల ఐలయ్య: రాజాపేట, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో ఉన్నట్లు పేర్కొన్న 251 ఎకరాల భూములపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
  • మల్లు రవి: శంషాబాద్‌లో ఉన్నట్లు పేర్కొన్న 86 ఎకరాల భూముల వివరాలను పరిశీలించాలని కోరారు. ఈ వివరాలు ప్రజలు తమకు అందించిన సమాచారంలో భాగమని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయా భూముల యాజమాన్యం, రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు, చట్టబద్ధతపై సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని కోరారు.

స్టీఫెన్సన్ భూముల వ్యవహారంపైన ప్రశ్నలు

ఎల్విన్ స్టీఫెన్సన్‌కు చెందిన సికింద్రాబాద్ భూములపై కూడా విచారణ జరపాలని ప్రభుత్వం చూస్తోందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ, 2015లో స్టీఫెన్సన్‌కు రూ.50 లక్షల లంచం ఇవ్వజూపిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చిందని, ఆ ఘటనలో చంద్రబాబు నాయుడి వాయిస్ కూడా ప్రస్తావనకు వచ్చిందని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన న్యాయపరమైన పరిణామాలను ప్రస్తావించిన ఆయన, స్టీఫెన్సన్ భూముల విచారణ వెనుక ఉద్దేశాలపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. భూముల వ్యవహారాన్ని రాజకీయ ఒత్తిడికి సాధనంగా ఉపయోగించకూడదని, విచారణ ఏదైనా చట్టబద్ధంగా, పారదర్శకంగా జరగాలని అన్నారు.

ఆర్టికల్ 14 ప్రకారం అందరికీ సమాన న్యాయం

రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వ హక్కును కల్పిస్తుందని ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. ఒకే విధమైన ఆరోపణలు ఉన్నప్పుడు ఒక పార్టీ నాయకుల భూములనే విచారించి, అధికార పార్టీ నాయకుల భూములను విస్మరించడం సమానత్వ సూత్రానికి విరుద్ధమని అన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించవచ్చని కేటీఆర్, హరీశ్ రావు చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ వ్యవహారంలో నిష్పక్షపాత విచారణే ప్రధానమని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయకుండా, కాంగ్రెస్ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, అనుబంధ సంస్థలకు సంబంధించిన భూముల వివరాలను కూడా పరిశీలనకు పంపాలని కోరారు. 1968 కండక్ట్ రూల్స్‌ను ప్రస్తావించిన ప్రవీణ్ కుమార్, నిబంధనల ప్రకారం ఫైళ్లను నడపాలని, సంబంధిత వ్యక్తుల వివరణలు, సమాధానాలు స్వీకరించాలని అన్నారు. రాజకీయ కక్షతో చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రూల్స్ 3(1)(ఎ), 3(1)(బి), 3(3) ప్రకారం సంబంధిత ప్రక్రియను అనుసరించి, అభ్యంతరాలను నోట్‌ఫైల్‌లో నమోదు చేయాలని కోరారు.

అబ్దుల్లాపూర్‌మెట్ భూ వ్యవహారాలపై విచారణకు డిమాండ్

అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో తహసీల్దార్‌గా పనిచేసిన సుదర్శన్ రెడ్డి వ్యవహారాలపైన విచారణ జరపాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి బంధువుగా చెప్పుకుంటూ అర్థరాత్రి వరకు కార్యాలయంలో ఉండి అక్రమ పనులు చేశారనే ఆరోపణలు ఉన్నాయని, ఎకరాకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ముడుపులు తీసుకున్నారనే వార్తలు వచ్చాయని పేర్కొన్నారు. ఆయన రెండేళ్ల పదవీకాలంలో ఎవరెవరికి ముడుపులు అందాయనే అంశంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఈ ఆరోపణలపై వాస్తవాలను వెలికితీసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెరుగు గోపాల్ యాదవ్ ఢిల్లీలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించిన ప్రవీణ్ కుమార్, ఆయనపై ఎస్సీ, ఎస్టీలకు చెందిన 200 ఎకరాలకు పైగా భూములను అక్రమంగా తన పేరుపైకి మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఈ వ్యవహారాన్ని సంబంధిత చట్టాల ప్రకారం విచారించాలని కోరారు.

ఓట్ చోరీ.. ఖేత్ కా చోరీ.. ఎస్సీ ఖేత్ చోరీ

ఎస్సీ, ఎస్టీల భూముల పరిరక్షణలో అధికారుల నిర్లక్ష్యంపై కూడా ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని చింతచెరువు ఫీడర్ ఛానల్ ఎఫ్‌టీఎల్ పరిధిలో సుమారు 200 ఎకరాల భూమిలో ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తికి చెందినట్లు పేర్కొన్న సంఘి విల్లాల నిర్మాణాలను నిలిపివేయాలని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజేందర్ రెడ్డి లేఖలు రాసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గూడెం కుంట, ఇంజాపూర్ గ్రామాల్లో ప్రహరీ గోడ నిర్మాణాన్ని నిలిపివేయాలని శ్రీ వాణి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌కు లేఖ రాసినా స్పందన లేదని తెలిపారు. సర్వే నంబర్లు 155, 156, 161, 163 పరిధిలో అనుమతులు లేకుండా సంఘి విల్లాల పేరుతో నిర్మాణాలు చేపడుతున్నారని అంజనేయులు అనే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖ రాసినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు.ఈ వ్యవహారాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన పేదల ఇళ్లను కూల్చివేసే అధికారులు, ప్రభావశీలులుగా భావిస్తున్న వ్యక్తుల భూ వ్యవహారాలపై మాత్రం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఓట్ చోరీ.. ఖేత్ కా చోరీ.. ఎస్సీ ఖేత్ చోరీ అంటూ, ఓటు హక్కుతో పాటు పేదలు, ఎస్సీ–ఎస్టీల భూముల హక్కుల పరిరక్షణ కూడా కీలకమైన అంశమని ఆయన పేర్కొన్నారు.

తొలి విడతలో 25 మంది భూముల వివరాలు.. రెండో విడతలో మరిన్ని ఆధారాలు

తాము వెల్లడించిన వివరాలు కేవలం మొదటి విడత మాత్రమేనని ప్రవీణ్ కుమార్ తెలిపారు. తదుపరి విడతలో మరిన్ని భూముల వివరాలు, సంబంధిత ఆధారాలను ప్రజల ముందుంచుతామని చెప్పారు. ప్రజలే తమకు సమాచారం అందిస్తున్నారని, తాము అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ బుల్లెట్‌ప్రూఫ్ బస్సుల్లో తిరగడం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో నకిలీ ఎఫ్‌ఐఆర్‌లు సృష్టించడం, బతికున్న వ్యక్తులను చనిపోయినట్లు చూపించడం వంటి వ్యవహారాలతో కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ అంశాలకు సంబంధించిన ఆధారాలు, వివరాలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు. జీవో 134 పరిధిలో అధికార పార్టీ నాయకుల భూములను కూడా చేర్చి నిష్పక్షపాత విచారణ జరపాలి. రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాన్ని ప్రభుత్వం గౌరవించాలి. ఛీఫ్ సెక్రటరీ స్పందించకపోతే హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తాం అని డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *