కల్వకుర్తిలో కరెంటు సెగ.. ఎండిపోతున్న పంటలపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం
ముద్విన్లో వరి పంటలను పరిశీలించిన జైపాల్ యాదవ్, దశరథ్ నాయక్.. ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
కడ్తాల్, అక్టోబర్ 8 (తెలంగాణ గర్జన): విద్యుత్ కోతలు, లో-వోల్టేజీ సమస్యల కారణంగా కల్వకుర్తి నియోజకవర్గంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలో విద్యుత్ సరఫరా అంతరాయాలతో ఎండిపోయిన, ఎండిపోతున్న వరి పంటలను కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్, కడ్తాల్ మాజీ జడ్పీటీసీ, రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్ నాయక్ తదితరులు కలిసి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట పొలాలను సందర్శించిన నేతలు రైతులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పరిస్థితి, సాగునీటి సమస్యలు, పంట నష్టానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడటంతో పంటలకు అవసరమైన సమయంలో సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి సాగు చేసిన వరి పంట చేతికొచ్చే సమయంలో కళ్లముందే ఎండిపోతుండటంతో తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నామని తెలిపారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా అందించి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
24 గంటల విద్యుత్ హామీ ఏమైంది?: జైపాల్ యాదవ్
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం కనీసం 7 గంటల నిరంతర విద్యుత్ సరఫరాను కూడా అందించలేకపోతోందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. విద్యుత్ కోతల కారణంగా పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేల చొప్పున తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడుతామని, రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా అందించడంతో పాటు ఇప్పటికే పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన అసెంబ్లీ వేదికపైనైనా, ప్రజా క్షేత్రంలోనైనా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నారు.

లో-వోల్టేజీతో రైతులకు తీవ్ర నష్టం: దశరథ్ నాయక్
దశరథ్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు కష్టాలు మళ్లీ మొదలయ్యాయని విమర్శించారు. ముఖ్యంగా గిరిజన తండాలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన రైతులు లో-వోల్టేజీ సమస్యలతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. లో-వోల్టేజీ కారణంగా రైతుల మోటార్లు, సబ్స్టేషన్ల పరిధిలోని ట్రాన్స్ఫార్మర్లు తరచూ కాలిపోతున్నాయని, వాటి మరమ్మతులు, మార్పిడి కోసం రైతులు అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని అన్నారు. రైతులు అప్పులపాలవుతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అన్నదాతలకు పూర్తి న్యాయం జరిగే వరకు కల్వకుర్తి గడ్డపై పోరాటాన్ని కొనసాగిస్తామని, రైతుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొస్తామని దశరథ్ నాయక్ హెచ్చరించారు. రైతులకు అండగా ఉంటామని, పంట నష్టంపై ప్రభుత్వంతో మాట్లాడి తగిన పరిహారం అందేలా కృషి చేస్తామని బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, డైరెక్టర్ జోగు వీరయ్య, సర్పంచ్ నీలావతి, లోకేష్ నాయక్, మాజీ సర్పంచులు యాదయ్య, నరసింహ గౌడ్, భాగ్యమ్మ, జంగయ్య, ఉపసర్పంచ్ బాలు నాయక్, మాజీ ఉపసర్పంచ్ రామకృష్ణ, వినోద్, గోపాల్, రాజు, శీను, పర్వతాలు, వెంకటయ్య,జంగయ్య, సైదులు, మహేష్, వెంకటేష్,శీను, సత్తయ్య, హరి, నవీన్, పెంటయ్య, నారయ్య, కృష్ణయ్యతో పాటు పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.




