బాలగోపాల్‌ స్ఫూర్తితో హక్కుల ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలి

ఈ వార్తను షేర్ చేయండి:

ఓటు హక్కు పరిరక్షణ ఉద్యమానికి ప్రజాస్వామ్యవాదులు అండగా నిలవాలి

నల్లగొండ, అక్టోబర్ 8 (తెలంగాణ గర్జన): ఓటు హక్కు పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమానికి ప్రజాస్వామ్యవాదులు అండగా నిలవాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు జి. మోహన్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు పిలుపునిచ్చారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన ధీశాలి బాలగోపాల్‌ అని వారు కొనియాడారు.

మానవ హక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్‌ 17వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం నల్లగొండ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ప్రజా, హక్కుల సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ హింసతో పాటు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ద్వారా జరిగే హింసను కూడా బాలగోపాల్‌ తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆయన నిరంతరం పోరాడారని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు, పట్టణాలతో పాటు అడవుల నుంచి జనారణ్యాల వరకు ఎక్కడ సమస్య తలెత్తినా అక్కడికి వెళ్లి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, వాస్తవాలను వెలుగులోకి తెచ్చేలా నిజనిర్ధారణ నివేదికలను విడుదల చేసేవారని గుర్తుచేశారు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మానవ హక్కుల పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం సాగించిన ఆయనకు దేశ భౌగోళిక, నైసర్గిక స్థితిగతులపై అపారమైన అవగాహన ఉండేదని అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేది ప్రశ్నించే గొంతుకలు కాదని, ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే వైఖరేనని వారు పేర్కొన్నారు. బాలగోపాల్‌ను స్మరించుకోవడమంటే ఆయన ఆశయాలకు అనుగుణంగా హక్కుల ఉద్యమాలను మరింత బలోపేతం చేయడమేనని స్పష్టం చేశారు. ఆయన స్ఫూర్తితో హక్కుల ఉద్యమాలపై అణచివేతకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి టి. వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు పి. వెంకులు, పి. ఏడుకొండలు, పీడీఎస్‌యూ నాయకులు ఇందూరి సాగర్‌, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు ఆర్. విజయకుమార్‌, జి. కాశయ్య, బహుజన కమ్యూనిస్టు పార్టీ నాయకులు కె. పర్వతాలు, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షమయ్య, గూడూరు జానకిరామ్‌రెడ్డి, సునీత, న్యాయవాదులు భీమార్జున్‌రెడ్డి, శివప్రసాద్‌, మదన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *