కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్తో క్రికెట్‌కు క్రేజ్ తగ్గదు: సెహ్వాగ్
ముంబై, సెప్టెంబరు 26 (తెలంగాణ గర్జన డెస్క్): విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికినంత మాత్రాన అభిమానుల్లో క్రికెట్‌పై ఆసక్తి తగ్గదని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. ఏ ఒక్క ఆటగాడిపైనా క్రికెట్ ఆధారపడి ఉండదని, ఆటగాళ్ల కంటే ఆటే గొప్పదని స్పష్టం చేశారు.
గతంలోనూ ఇలాంటి మాటలే..
కోహ్లీ, రోహిత్ రిటైర్ కావడంతో అభిమానులు క్రికెట్ చూడటం తగ్గిస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయని, ఇలాంటి మాటలే గతంలో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన సమయంలోనూ వచ్చాయని సెహ్వాగ్ గుర్తుచేశారు. అయితే ఆ దిగ్గజాల తర్వాత కూడా అభిమానులు క్రికెట్‌ను చూడటం కొనసాగించారని చెప్పారు.
ఆటగాళ్లు మారినా.. క్రికెట్ కొనసాగుతుంది
తాను రిటైర్ అయిన తర్వాత కూడా కొందరు అభిమానులు ‘‘మీరు ఆడటం మానేశాక మేము క్రికెట్ చూడటం మానేశాం’’ అని చెప్పేవారని సెహ్వాగ్ తెలిపారు. అయితే అలాంటి వారు పూర్తిగా క్రికెట్‌కు దూరమయ్యారని తాను భావించలేదన్నారు. ఏదో ఒక రూపంలో మ్యాచ్‌లను చూస్తూనే ఉంటారని పేర్కొన్నారు. ‘‘కేవలం క్రికెటర్ల వల్లే క్రికెట్ కొనసాగుతుంటే.. అది ఎప్పుడో ఆగిపోయేది’’ అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
మొబైల్‌తో పెరిగిన వీక్షకులు
గతంతో పోలిస్తే ప్రస్తుతం క్రికెట్ చూసే వారి సంఖ్య మరింత పెరిగిందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. గతంలో మ్యాచ్‌లు ప్రధానంగా టెలివిజన్‌లో మాత్రమే అందుబాటులో ఉండేవని, ఇప్పుడు మొబైల్ ఫోన్లలోనూ మ్యాచ్‌లను సులభంగా వీక్షించే అవకాశం ఉండటంతో క్రికెట్ మరింత మందికి చేరువైందని వివరించారు.


