స్థానికతకు నాలుగేళ్ల చదువు తప్పనిసరి
- తెలంగాణ స్థానిక హోదాపై సుప్రీంకోర్టు స్పష్టత
- విద్యార్థిని పిటిషన్ను కొట్టివేసిన ధర్మాసనం
- రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు మద్దతు
- ఎంబీబీఎస్ ప్రవేశాల్లో స్థానిక రిజర్వేషన్పై కీలక తీర్పు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 (తెలంగాణ గర్జన): తెలంగాణలో స్థానిక హోదా పొందడానికి నాలుగేళ్ల నిరంతర విద్యాభ్యాసం తప్పనిసరి అనే నిబంధనను సుప్రీంకోర్టు మరోసారి సమర్థించింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అమలవుతున్న స్థానికత నిబంధనలు చట్టబద్ధమైనవేనని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణలో స్థానిక రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన కీలక అంశంపై సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పును వెలువరించింది. జెల్లా అంకిత అనే విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ పి.ఎస్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అర్హత పరీక్షకు ముందు వరుసగా నాలుగేళ్ల పాటు తెలంగాణలో చదివి ఉండాలన్న నిబంధన రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించారు. అయితే ఈ వాదనల్లో బలం లేదని అభిప్రాయపడిన ధర్మాసనం పిటిషన్ను తిరస్కరించింది.
తెలంగాణలో స్థానిక రిజర్వేషన్ పొందాలంటే విద్యార్థి క్వాలిఫైయింగ్ పరీక్షకు ముందు కనీసం నాలుగేళ్ల పాటు రాష్ట్రంలోనే విద్యాభ్యాసం చేసి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎంబీబీఎస్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల విషయంలో ఈ నిబంధన అమలులో ఉంటుందని పేర్కొంది. స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించేందుకు ఈ విధానం కీలకమని న్యాయస్థానం అభిప్రాయపడింది. గతంలో జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఆ తీర్పులో పేర్కొన్న అంశాలను పునరుద్ఘాటిస్తూ ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలకు న్యాయబద్ధత ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రూపొందించిన స్థానికత ప్రమాణాలను పాటించాల్సిందేనని పేర్కొంది.
స్థానికత నిబంధనలపై గత కొంతకాలంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న సందిగ్ధతకు ఈ తీర్పుతో ముగింపు పలికినట్లయింది. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన అర్హత ప్రమాణాలు స్పష్టంగా ఉన్నాయని, వాటిని ఏకపక్షంగా మార్చలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. విద్యార్థులు నిబంధనలకు అనుగుణంగా అర్హత సాధించాల్సి ఉంటుందని తెలిపింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తెలంగాణలో స్థానిక హోదా నిర్ధారణకు నాలుగేళ్ల నిరంతర విద్యాభ్యాసం అనే నిబంధన మరింత బలపడింది. భవిష్యత్తులో స్థానిక రిజర్వేషన్లకు సంబంధించిన వివాదాల్లో ఈ తీర్పు కీలక మార్గదర్శకంగా ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్థానికత విధానానికి కూడా ఈ తీర్పు మద్దతు లభించినట్లయింది.




