ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు ఊరట

ఈ వార్తను షేర్ చేయండి:
  • ఈడీ జారీ చేసిన ఆస్తుల జప్తు ఉత్తర్వుల రద్దు
  • అప్పిలేట్ ట్రైబ్యునల్ కీలక నిర్ణయం
  • ఇతర నిందితులకు కూడా అనుకూల తీర్పు
  • ఇప్పటికే కోర్టు అధీనంలో నగదు ఉందన్న ధర్మాసనం

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (తెలంగాణ గర్జన ): 2015లో నమోదైన సంచలనాత్మక ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కీలక ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన రూ.50 లక్షల ఆస్తుల జప్తు ఉత్తర్వులను అప్పిలేట్ ట్రైబ్యునల్ రద్దు చేసింది. రేవంత్ రెడ్డితో పాటు కేసులో ఉన్న ఇతర నిందితులకూ ఇదే నిర్ణయం వర్తిస్తుందని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 14న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. కేసులో స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షల నగదు ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ స్వాధీనం చేసుకుని సంబంధిత న్యాయస్థానంలో జమ చేసిన విషయాన్ని పిటిషనర్లు ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన ధర్మాసనం పలు కీలక అంశాలను పరిశీలించింది.
వివాదాస్పద నగదు ఇప్పటికే కోర్టు ఆధీనంలో ఉన్న నేపథ్యంలో అదే మొత్తానికి సమానమైన ఆస్తులను మరోసారి మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద జప్తు చేయడం సమంజసం కాదని ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. నిందితులు ఆ నగదు లేదా ఆస్తులను బదిలీ చేసే అవకాశం లేనప్పుడు అటాచ్‌మెంట్ కొనసాగించాల్సిన అవసరం లేదని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు లంచం ఇవ్వజూపారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. మొత్తం రూ.5 కోట్ల ఒప్పందంలో భాగంగా రూ.50 లక్షల నగదు అడ్వాన్స్‌గా ఇవ్వడానికి ప్రయత్నించిన సమయంలో ఏసీబీ అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఏసీబీ నమోదు చేసిన కేసును ఆధారంగా తీసుకుని ఈడీ కూడా మనీలాండరింగ్ కోణంలో విచారణ ప్రారంభించింది. అనంతరం సంబంధిత ఆస్తులను అటాచ్ చేస్తూ చర్యలు చేపట్టింది. 2022లో ఈ అటాచ్‌మెంట్‌ను సమర్థిస్తూ వెలువడిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రేవంత్ రెడ్డి సహా ఇతర నిందితులు అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. పలు విడతలుగా విచారణ కొనసాగిన అనంతరం తాజాగా తీర్పు వెలువడింది. తాజా నిర్ణయంతో రేవంత్ రెడ్డికి ఈ కేసులో ఒక కీలక న్యాయపరమైన ఊరట లభించినట్టయింది. అయితే అసలు కేసుకు సంబంధించిన విచారణలు, ఇతర న్యాయ ప్రక్రియలు ఆయా న్యాయస్థానాల్లో కొనసాగనున్నాయి. ట్రైబ్యునల్ తీర్పు నేపథ్యంలో రాజకీయ వర్గాల్లోనూ ఈ వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *