ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్
-దళిత, ఆదివాసీ ఆత్మగౌరవ సదస్సులో భట్టి విక్రమార్క
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 (తెలంగాణ గర్జన): కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల వేదిక ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన దళిత-ఆదివాసీ ఆత్మగౌరవ సదస్సులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. సదస్సులో మాట్లాడిన భట్టి విక్రమార్క, హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై జరిగిన ఘటనను ఖండించారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీతో పాటు అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులు, అన్యాయాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
సామాజిక న్యాయం కోసం స్వరం వినిపిస్తున్న ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేయడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదవుతున్న కేసులు సంస్థాగత నిష్పక్షపాతతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పరిరక్షణ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల గౌరవం, హక్కుల రక్షణ కోసం పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
దేశ నిర్మాణంలో అణగారిన వర్గాలకు సముచిత స్థానం కల్పించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరిగే అన్యాయాలపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల నాయకులు, సామాజిక సంస్థల ప్రతినిధులు హాజరై సామాజిక న్యాయం, సమాన హక్కుల అంశాలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.




