బాపూజీ స్ఫూర్తి ని ఆవాహన చేసుకోవాలి

ఈ వార్తను షేర్ చేయండి:
  • నేడు తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ జయంతి
  • 94 ఏండ్ల వయసులోనూ ఢిల్లీలో, చలిలో నిస్వార్థంగా, నిర్భీతిగా, నిలబడి ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిన అలుపెరుగని యోధుడు
  • 1969లోనే తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి నేత.
  • 2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిష్కరణ సభకు తన నివాసం ‘జలదృశ్యం’ని వేదికగా చేసిండు.

మహాత్ములు, జాతిపితలు, వైతాళికులను తలుచుకోవడమంటే చరిత్రలో మనం నడిచొచ్చిన దారిని తెలుసుకోవడమే! ఈ తోవలు వారి త్యాగం, పోరాటాల ఫలితమని గుర్తుంచుకోవాలి. చరిత్రకు వర్తమానానికి వీళ్లు వంతెనలు. బంగారు భవిష్యత్ నిర్మాణానికి వారి స్ఫూర్తిని నిరంతరం ఆవాహన చేసుకోవాలి. తద్వారా ‘సామాజిక తెలంగాణ’ సాధ్యమని నినదించాలి. నిజానికి చరిత్రను, త్యాగమూర్తులను, పోరాట యోధులను, స్ఫూర్తి ప్రదాతలను మరిచిన ఏ సమాజం గౌరవాన్ని పొందలేదు. అభివృద్ధి చెందలేదు. గర్వంగా మనలేదు. ఇప్పుడిదంతా ఎందుకంటే ఇవ్వాళ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని జరుపుకుంటున్నాము. ఆ మహానీయుడి ఆశయాల సాధనకు పునరంకితమవుదామని ప్రతిన బూనుతున్నాము. ఆయన లాగా 94 ఏండ్ల వయసులోనూ ఢిల్లీలో, చలిలో నిస్వార్థంగా, నిర్భీతిగా, నిలబడి కొట్లాడిన శక్తిని మనకివ్వాలని కోరుకుందాం.

గాంధీ స్ఫూర్తితో బాపూజీ రాజకీయాల్లోకి వచ్చిండు. 1941లో మహారాష్ట్రలో గాంధీ సభ జరిగితే తన పుట్టినూరు వాంకిడి (కొమురం భీమ్ జిల్లా) నుంచి 30 కిలీమీటర్లు కాలినడకన నడిచి హాజరయ్యిండు. అప్పటి నుంచే గాంధీ టోపీ ధరించడం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం, నాన్ ముల్కీ ఉద్యమం, ప్రత్కేక తెలంగాణ ఉద్యమం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిండు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం 1969లోనే మంత్రిపదవికి రాజీనామా చేసిండు. ఇట్లా రాష్ట్రం కోసం పదవికి రాజీనామా చేసిన తొలి నేత.
బాపూజీ 25 ఏండ్లు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, ఎమ్మెల్యే, మంత్రిగా ప్రజల తరపున పనిచేసిండు. ఏఐసీసీ (ఆలిండియా కాంగ్రెస్ కమిటీ) లాంటి పార్టీ వేదికల మీదే బహుజన రాజ్యాధికారాన్ని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రావశ్యకతను ప్రస్తావించి గుండె ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఇదే ఆ తర్వాత ఆయన రాజకీయాలకు అవరోధంగా మారింది. అయినా వెనకడుగేయలేదు. ప్రజల పక్షాన నిలబడిండు. కొట్లాడిండు. 45 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ బయట ఉండి ‘సామాజిక న్యాయం’ కోసం, ‘ప్రత్యేక తెలంగాణ’ కోసం ఉద్యమాలు చేసిండు. అంతెందుకు దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కావడానికి చోదకశక్తిగా పనిచేసిండు. దేశంలోనే తొలిసారిగా ఒక దళితుడు ముఖ్యమంత్రి కావడంలో బాపూజీ కీలకంగా పనిచేసిండు. రాష్ట్ర రాజకీయాలను ఔపోసన పట్టిండు కాబట్టే ‘రెడ్డి’ నాయకుల వ్యూహాలను అధిగమించి ఇందిరాగాంధీని ఒప్పించి సంజీవయ్యను 1960లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధిష్టింప జేసిండు. ఆ పదవి అధిష్టించే కాలానికి సంజీవయ్యకు 39 ఏండ్లు మాత్రమే. ఇప్పటికీ తెలుగురాష్ట్రాల్లో ఆయనే యంగెస్ట్ చీఫ్ మినిస్టర్.

ఒకవైపు ఆర్యసమాజ్ ఉద్యమాలతో మమేకమై ఏడో నిజామ్ ఉస్మాన్ అలీఖాన్‌మీద బాంబులు వేసేందుకు నారాయణరావు పవార్, గంగయ్య, జగదీష్ ఆర్య తదితరులకు హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో శిక్షణ నిచ్చిండు. అక్కడి అఖాడాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావజాల వ్యాప్తి జేసిండు. స్వాతంత్య్రోదమంలో పాల్గొన్నాడు. సరిహద్దు క్యాంపులను నిర్వహించిండు. మరోవైపు దొరల దౌర్జన్యానికి బలైన చాకలి ఐలమ్మ కేసును వాదించిండు. ఆమెకు కమ్యూనిస్టులు అండగా ఉన్నప్పటికీ కేసు మాత్రం కాంగ్రెస్ వాది అయిన బాపూజీ ఒక్కపైసా తీసుకోకుండా వాదించిండు.


రెడ్లను ఓడించి తొలిసారిగా అసెంబ్లీలో 1952లో అడుగుపెట్టిన బాపూజీ జీవిత పర్యంతం ‘సామాజిక న్యాయం’కోసం కొట్లాడిండు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చెన్నారెడ్డి నీరుగార్చే ప్రయత్నం చేస్తే టి.ఎన్.సదాలక్ష్మి తదితరులతో కలిసి ‘తెలంగాణ ప్రజా సమితి’ని బలోపేతం చేసి ఉద్యమాలు చేసిండు. ప్రజలను సంఘటితం చేసిండు. తెలంగాణ వాదాన్ని వినిపిస్తూ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల సత్తాని నిరూపించిండు. ఆనాటి నుంచి ఆఖరి శ్వాస వదిలే వరకూ తెలంగాణ కోసం నిలబడిండు. కలెబడిండు.
2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిష్కరణ సభకు తన నివాసం ‘జలదృశ్యం’ని వేదికగా చేసిండు. అయితే ఇది గిట్టని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- బాపూజీని ‘జలదృశ్యం’నుంచి బేదఖలు చేసిండు. ఆ తర్వాత కిరాయి యిండ్లలోనే ఉన్నాడు. పైలట్ అయిన కొడుకు ఉమేశ్‌ని చైనాతో యుద్ధంలో కోల్పోయినా నిబ్బరంగా ఉన్నాడు. అంతటి గంభీరమూర్తి, ధిక్కార స్ఫూర్తి తెలంగాణకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిండు. సామాజిక శక్తులన్నింటినీ కూడగట్టిండు. మందకృష్ణ మాదిగతో పాటు అనేక మంది సామాజిక ఉద్యమకారులను గైడ్ చేసిండు. ఎందరో బడ్డింగ్ ఉద్యమకారులకు ఆర్థికంగా, హార్థికంగా తోడ్పడిండు.

విద్యద్వారానే సమాజం మారుతుందని నమ్మి, ఆచరించిన వ్యక్తి. అందుకే రెడ్డి సామాజిక వర్గం మాదిరిగానే తన సామాజిక వర్గమైన ‘పద్మశాలీ’లు సైతం విద్యను అభ్యసించాలని నారాయణగూడా, రాజ్ మొహల్లాలో ‘హాస్టల్’ నిర్మించిండు. నిర్మించిండు అని మాటవరుసకు చెప్పడం కాదు, తాను స్వయంగా పునాది కార్యక్రమంలో మట్టి ఎత్తిపోసిండు. సమాజాన్ని కూడగట్టి పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం హాస్టల్‌ని నిర్మింపజేసిండు. ఇది ఆయన దూరదృష్టికి నిదర్శనం.



బీసీ ఉద్యమాల్లోనూ మొదటి నుంచి ఉన్నాడు. భార్య శకుంతలతో కలిసి 1955లోనే కాకా కాలేల్కర్ కమిటీకి తెలంగాణ బీసీల తరపున వినతి పత్రాన్ని సమర్పించిండు. మండల్ కమిషన్ బృందానికి వినతి పత్రం ఇవ్వడమే గాకుండా అనేక దఫాలుగా వారితో చర్చలు జరిపిండు. అంతెందుకు ఆంధ్రప్రదేశ్‌లో 1960వ దశకం నుంచి బీసీ రిజర్వేషన్లు అమలు కావడానికి ఆయన వంతు కృషి చేసిండు. ఆ తర్వాతి కాలంలో మంత్రి అగిశం వీరప్పను ప్రోత్సహించి ‘బీసీ కాన్ఫరెన్స్’ని భారీ ఎత్తున నిర్వహించి సావనీర్‌ని కూడా వెలువరించారు. ఈ సావనీర్‌లో బాపూజీ ఒక వ్యాసం రాస్తూ బీసీలు తమ హక్కుల కోసం కొట్లాడాలని ఉద్బోధించాడు. రోడ్ మ్యాప్ ని ఇచ్చిండు. అంతకుముందు 1969 తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ ‘తెలంగాణ సంగతి’ అని తెలుగు, ఇంగ్లీషు భాషల్లో బుక్‌లెట్‌ని వెలువరించారు.



బాపూజీ కలలు కన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు సాకారమయింది. సాధించుకున్న తెలంగాణలో ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరమున్నది. ఆయన ఆశించిన ‘సామాజిక తెలంగాణ’ సాధన ఇంకా బాకీ ఉన్నది. అందుకోసం 88శాతమున్న బహుజనులందరూ ఐక్యంగా కొట్లాడాల్సిన అవసరమున్నది. కాంగ్రెస్‌వాది అయిన బాపూజీని సదా స్మరించుకునేందుకు రేవంత్ రెడ్డి నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ పేరు పెట్టి గౌరవించుకోవాల్సిన అవసరమున్నది. ఈ డిమాండ్ సాధన కోసం బహుజనులందరూ, ముఖ్యంగా పద్మశాలి నేతలు ఊరూరా అక్కడి రాజకీయ నేతలపై, అంతిమంగా ముఖ్యమంత్రిపై వత్తిడి తేవాల్సిన సందర్భమిది. సాధించుకున్న తెలంగాణలో గౌరవించుకునే తరీఖా ఇది.

-డా. సంగిశెట్టి శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *