ఎల్ నినో కంటే ఎల్ కాంగో వల్ల రాష్ట్రం ఆగమైతుంది
– డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిఆర్ఎస్.
- అక్రమ ఇసుక దందా వద్దన్నందుకే ఎస్సీ సర్పంచ్ పై వివక్ష.
- వంగూరులో సిఎం అనుచరుల అక్రమ ఇసుక దందా.
- అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సర్పంచ్ కు క్షమాపణ చెప్పాలి.
- రేవంత్ రెడ్డి,పొంగులేటి భూములను 134 జీవో ద్వారా విచారించాలి.
రేవంత్ రెడ్డి పాలనలో ఎస్సీ ప్రజాప్రతినిధులపై వివక్ష పెరుగుతోందని,బిల్లులు ఇవ్వకుండా,గ్రామాల అభివృద్ధికి సహకరించకుండా తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత మండలంలోని జాజాల గ్రామ సర్పంచ్ కాశమ్మను పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇందిరమ్మ పాలన అని చెబుతూనే,కాశమ్మ లాంటి మహిళ ప్రతినిధులను వేధిస్తున్నారన్నారు.సర్పంచ్ తమ బంగారు నగలను ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి అభివృద్ధి పనులు చేస్తే రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు,స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ మహిళ సర్పంచ్ ను వేధిస్తూ, బిల్లులు ఇవ్వమని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మానసికంగా వేధిస్తున్నారని మండిపడ్డారు.
వాస్తవానికి దళితులను వేధిస్తున్నది రేవంత్ రెడ్డేనన్నారు. అసెంబ్లీలో స్పీకర్ ను పదేపదే దళిత దళిత అంటూ అవమానించారు.వేముల వీరేశంను నల్గొండ క్లాక్ టవర్ ముందు కొడుతామన్నారు.సంధ్యారావు పేరిట తప్పుడు వార్తలు అసెంబ్లీలో ప్రచారం చేసి దళితులను అవమానించారు. చెయ్యని నేరానికి ఫాం హౌస్ కేసులో, ఇందిరాగాంధీ మర్డర్ కేసు వలే, టెర్రరిస్ట్ కేసు వలే విచారణ జరిపి మూడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు, కానీ కాశమ్మకు జరిగిన అన్యాయంపై ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఒక ఎస్సీ సర్పంచ్ ను తాటతీస్తా అంటూ మాట్లాడాన్ని ఆయన ఖండించారు. కాశమ్మ రేవంత్ రెడ్డి వలే వందల ఎకరాల భూములు అడగడం లేదు, వాల్లు చేసే దందాల్లో వాటా అడగడం లేదు, కేవలం వాల్ల ఊరికి నీళ్లు రావాలని పోరాడుతున్నారు,అందుకు ఇసుక దందా ఆపాలంటున్నారని స్పష్టం చేశారు.

వంగూరు మండలంలోని జాజాల,ఉల్పర, పోతరెడ్డిపల్లి గ్రామాల శివారులో రేవంత్ రెడ్డి అనుచరుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు, కుట్ర పెంచుకొని స్థానిక ఎమ్మెల్యే,సర్పంచ్ బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాంటి అనుమతి లేకుండా రేవంత్ రెడ్డి అనుచరుల ప్రోద్భలంతో అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆరోపిస్తూ, దుందుబి వాగులో ఉన్న ఇసుక రీచ్ లను సందర్శించారు. అధికారికంగా ఇసుక మైనింగ్ కొనసాగితే ఈ రోజు అధికారులు, నిర్వాహకులు ఎందుకు ఉండకుండా పారిపోయారంటూ ధ్వజమెత్తారు. వాగులో హిటాచి వాహనాలను నిబంధనలకు విరుద్దంగా దింపి, అక్రమంగా ఇసుక తవ్వి కుప్పలుగా పేర్చి, ఎలాంటి వే బిల్స్ లేకుండా ఇసుక దందా కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
ఇసుక లారీలు కొండారెడ్డిపల్లిలోని ముఖ్యమంత్రి ఇంటి ముందు నుండి రాత్రింభవళ్లు నడుస్తున్న పట్టించుకున్న నాధుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మార్వో,మైనింగ్ అధికారులు, పోలీసు అధికారులకు ఫోన్ చేసి అక్రమ మైనింగ్ ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించారు. అనుమతి లేని అక్రమ మైనింగ్ వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి,సాగు,తాగు నీటి సమస్య ఏర్పడుతుందన్నారు.ఇప్పటికీ ఎల్ నినో వల్ల వర్షాభావ సమస్యలు ఏర్పడ్డాయని, ఉన్న నీటిని కూడా మైనింగ్ కోసం దోచుకుంటున్నారన్నారు.
రేవంత్ రెడ్డి వద్దని హెచ్చరిస్తే ఒక్క నిమిషంలో అక్రమ మైనింగ్ ఆగిపోతుంది కానీ, ఆయన కుటుంబ సభ్యులు మరియు అనుచరులే దందాలు చేస్తున్నారు కాబట్టి అడ్డుకోవడం లేదన్నారు.
వెంటనే అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని,బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా, లారీలు మరియు జెసిబిలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తే అందుకే బిఆర్ఎస్ నాయకులను వేధించడానికి 134 జీవో కింద భూముల విచారణకు కమిటీ వేసిందన్నారు. అయితే రేవంత్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకుల భూములపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 22 ఎ నిషేధిత జాబితాలో విలువైన భూములు చేర్చి, వెనుక నుండి దళారుల ద్వారా వెంచర్లు వేసి అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
ఎల్ నినో కంటే ఎల్ కాంగో వల్ల రాష్ట్రం ఆగమైతుందన్నారు. రేవంత్ రెడ్డి అండదండలతో, బల్మూరి వెంకట్ దళిత వర్గానికి చెందిన ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామిని వేధిస్తున్నారని మండిపడ్డారు.
కోటి మంది కోటీశ్వరులను చేస్తామని మాటిచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, శోభా రెడ్డి అనే మహిళ కాంట్రాక్టు అడిగినందుకు గెస్ట్ హౌస్ రమ్మని వేధిస్తున్నారన్నారు. అసెంబ్లీ స్పీకర్ గురించి పదే పదే దళిత అంటూ మాట్లాడిన ముఖ్యమంత్రి దళిత మహిళ ప్రతినిధి కాశమ్మను ఎందుకు పరామర్శించడం లేదని అడిగారు.
కాశమ్మకు జరిగిన అన్యాయంపై స్థానిక జిల్లా పంచాయితీ రాజ్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు, ఉద్దేశ్యపూర్వకంగా బిల్లులు రాకుండా అడ్డుకుంటే ఊరుకోమని హెచ్చరించారు.

పొల్కంపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పొల్కంపల్లి సబ్ స్టేషన్ మరియు కొండారెడ్డి పల్లి సబ్ స్టేషన్లను సందర్శించారు. కొండారెడ్డి పల్లి సబ్ స్టేషన్ లో 24 గంటల కరెంట్ ఇచ్చి మిగతా గ్రామాలకు ఎందుకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని నిలదీశారు. కొండా రెడ్డి పల్లికి ఒక న్యాయం, మిగతా 12 వేల గ్రామాలకు ఇంకో న్యాయం ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
గతంలో బిఆర్ఎస్ పాలనలో మహిళలకు పెద్దపీట వేసిందన్నారు,మార్కెట్ కమిటీల్లో,ఎక్సైజి టెండర్లలో మహిళలకు అవకాశం ఇచ్చారని,స్వయం ఉపాధి రంగంలో మహిళల కోసం ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ చేస్తున్న దోపిడీని బిఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని,దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, నరెందర్ రావు, సతీష్, కొమ్ము శ్రీనివాస్ యాదవ్ మరియు ఇతర నియోజకవర్గ, మండల బిఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.




