మైనింగ్‌ వ్యతిరేక పోరులో ఆకుతోటపల్లి.. ఏడో రోజుకు దీక్ష

ఈ వార్తను షేర్ చేయండి:
  • ఆకుతోటపల్లిలో కొనసాగుతున్న నిరసన.. మైనింగ్‌, క్రషర్‌ అనుమతులపై సమగ్ర విచారణకు గ్రామస్తుల డిమాండ్

మైనింగ్‌ వ్యతిరేక పోరులో ఆకుతోటపల్లి.. ఏడో రోజుకు దీక్ష
ఆకుతోటపల్లిలో కొనసాగుతున్న నిరసన.. మైనింగ్‌, క్రషర్‌ అనుమతులపై సమగ్ర విచారణకు గ్రామస్తుల డిమాండ్

సెప్టెంబర్ 27, (తెలంగాణ గర్జన డెస్క్): రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోని ఆకుతోటపల్లి గ్రామ సమీపంలో మైనింగ్‌, క్రషర్‌ కార్యకలాపాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ గ్రామస్తులు చేపట్టిన నిరసన దీక్ష ఏడో రోజుకు చేరుకుంది. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న ఈ దీక్షలో గ్రామస్తులు తమ అభ్యంతరాలను వెల్లడిస్తూ, సంబంధిత అనుమతులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ర్యాలీలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు.

సర్వే నంబర్‌ 304లో భూముల వివరాలపై అభ్యంతరాలు

గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఆకుతోటపల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 302, 304 పరిధిలో మొత్తం 402 ఎకరాల భూమి ఉందని ఇందులో 377 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, మరో 25 ఎకరాలను పేదలకు కేటాయించినట్లు వారు తెలిపారు. అయితే 4.86 హెక్టార్ల భూమిని పట్టా భూమిగా రికార్డుల్లో చూపించి క్రషర్‌, మైనింగ్‌ కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల్లో క్రషర్‌ ఏర్పాటుకు స్థానిక గ్రామపంచాయతీ నుంచి అవసరమైన అనుమతులు తీసుకున్నట్లు ఆధారాలు లేవని, మైనింగ్‌కు సంబంధించి నిర్వహించాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగలేదని వారు పేర్కొన్నారు.

జనావాసాలకు సమీపంలో క్రషర్‌ ఏర్పాటుపై ఆందోళన

గ్రామానికి సుమారు 500 మీటర్ల పరిధిలోనే భారీ క్రషర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో దుమ్ము, ధూళి, శబ్ద కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకుతోటపల్లిలో సుమారు 200 కుటుంబాలు వ్యవసాయం, పాడి పశుపోషణ, గొర్రెలు, మేకల పెంపకం, కోళ్ల పెంపకం, వ్యవసాయ కూలీ పనులపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. గుట్టల చుట్టూ ఉన్న పచ్చిక బయళ్లు, సహజ వనరులు దెబ్బతింటే తమ జీవనోపాధికి ఇబ్బందులు ఏర్పడతాయని పేర్కొన్నారు. మైనింగ్‌ వల్ల భూగర్భ జలాల సహజ రీఛార్జ్‌ ప్రక్రియపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారులకు వినతులు.. జాయింట్‌ కమిటీ నివేదికపై ప్రశ్నలు

మైనింగ్‌, క్రషర్‌ అంశంపై జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ సహా వివిధ శాఖల అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్తులు తెలిపారు. వివాదం నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏర్పాటు చేసిన జాయింట్‌ కమిటీ నివేదికను కూడా బహిర్గతం చేయలేదని వారు ఆరోపించారు.

గ్రామస్తులకు పురుషోత్తంరెడ్డి సంఘీభావం

ఆకుతోటపల్లి గ్రామస్తుల ఆందోళనకు పర్యావరణవేత్త, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మైనింగ్‌, క్రషర్‌ కార్యకలాపాలు నిర్వహించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. మైనింగ్‌, రాతి క్రషింగ్‌, బ్లాస్టింగ్‌ వల్ల గాలి, శబ్ద కాలుష్యం పెరిగే అవకాశం ఉందని, రాతి ధూళిలోని సిలికా కణాలను దీర్ఘకాలం పీల్చడం వల్ల సిలికోసిస్‌ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆయన వివరించారు. గుట్టల విధ్వంసం కొనసాగితే భవిష్యత్తులో నీటి సమస్య తీవ్రతరం కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వనరులను దెబ్బతీయకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చే సుస్థిర అభివృద్ధి అవసరమని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రజల బాధ్యత కూడా అని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఎ(జి)ను ప్రస్తావించారు.

జీఎంపీఎస్‌ మద్దతు

సర్వే నంబర్లు 302, 304లో మంజూరైన మైనింగ్‌, క్రషర్‌ అనుమతులను రద్దు చేయాలని గొర్రెల మేకల పెంపకదార్ల సంఘం (జీఎంపీఎస్‌) జిల్లా కన్వీనర్‌ మల్లేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కొద్ది రోజుల క్రితం జీఎంపీఎస్‌ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి గ్రామస్తులకు సంఘీభావం తెలిపారు. మైనింగ్‌ కార్యకలాపాలతో వ్యవసాయ భూములు దెబ్బతినే అవకాశం ఉందని, గ్రామస్తుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అనుమతులను పునఃపరిశీలించాలని మల్లేశ్‌ కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్యకలాపాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మైనింగ్‌, క్రషర్‌ అనుమతులపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్యకలాపాలను నిలిపివేసి గ్రామాన్ని కాలుష్యం నుంచి రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

దీక్షలో భారీగా పాల్గొంటున్న గ్రామస్థులు…

ఇప్పటివరకు జరిగిన దీక్షలో గ్రామ సర్పంచ్‌ న్యాలపట్ల నరేందర్‌రెడ్డి, శ్రీపాతి శశిధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ రామచంద్రయ్య, న్యాలపట్ల కృష్ణారెడ్డి, కార్తీక్‌రెడ్డి, అమరేష్‌రెడ్డి, హజాపాషా, షేక్‌ సాజిద్‌, శరత్‌కుమార్‌, తెల్లమల్ల విజయ్‌, వల్లపూదాసు విజయ్‌, వట్టికోట కృష్ణ, దొడ్డమోని కృష్ణ, వనం విజయ్, కంబాలపల్లి స్వరూప, భైరవోని మహేష్, శ్రీపాతి సంతోష్ రెడ్డి, కంబాలపల్లి బాలు, కూర రమేష్, కంబాలపల్లి విజయచందర్, దొడ్డమోని ఈదమయ్య, నాగసాని తిరుపతి తదితరులు పాల్గొన్నారు. జీఎంపీఎస్‌ నాయకులు నారాయణ, కొండల్‌, కృష్ణయ్య, వెంకటయ్య, బీరయ్య, సాయిలు, జంగయ్య, సోమయ్య, యాదగిరి, అశోక్‌, రమేష్‌, నర్సింహ, మహేశ్‌, చంద్రయ్య, రామస్వామి, సత్తయ్య, నారయ్య, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *