ఐలమ్మ జయంతి.. మాడ్గులలో మౌనం!
- వేడుకలకు దూరంగా అధికారులు, ప్రజాప్రతినిధులు..
- మాడ్గుల మండలం లో జన్మ దినం రోజు పూల దండకు కూడా నోచుకోని ఐలమ్మ విగ్రహాలెన్నో…
మాడ్గుల, సెప్టెంబర్ 26 (తెలంగాణ గర్జన):
తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మాడ్గుల మండలంలోని గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మహనీయుల జయంతులను అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మండలంలోని పలు గ్రామాల్లో ఐలమ్మ జయంతి వేడుకల జాడ కనిపించకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి, బడుగు బలహీన వర్గాలకు స్ఫూర్తిగా నిలిచిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరానికి పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులపై ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. జయంతి సందర్భంగా కనీసం ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించే కార్యక్రమాలు కూడా నిర్వహించకపోవడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహనీయుల జయంతులను కేవలం క్యాలెండర్లోని తేదీలుగా కాకుండా, వారి పోరాట చరిత్రను ప్రజలకు తెలియజేసే సందర్భాలుగా నిర్వహించాలని వారు కోరుతున్నారు.
ఇకనైనా మాడ్గుల మండల స్థాయిలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించి, ఆమె పోరాట స్ఫూర్తిని ప్రజలకు తెలియజేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




