అండర్ డ్రైనేజీ నీటితో అవస్థలు..
- ఖాళీ స్థలంలో మురుగు నీరు.. దోమలు, దుర్వాసన, పాముల సంచారంతో కుప్పగండ్ల గ్రామవాసుల ఆందోళన..
వెల్దండ, సెప్టెంబర్ 27 (తెలంగాణ గర్జన): వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వెనుక కాలనీలో అండర్ డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారింది. డ్రైనేజీ నీరంతా ఖాళీ స్థలంలోకి చేరుతుండటంతో మురుగునీరు నిల్వ ఉండి దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసనతో పాటు మురుగు, పేరుకుపోయి చెట్లు, పిచ్చిమొక్కలు పెరగడంతో పాములు సంచరిస్తున్నాయని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు వాపోతున్నారు.
ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా.. పరిష్కారం ఎక్కడ?
కొద్దిరోజుల క్రితం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమం కోసం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కుప్పగండ్ల గ్రామానికి విచ్చేసిన సందర్భంగా కూడా కాలనీవాసులు డ్రైనేజీ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను విన్న ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినప్పటికీ, ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు కనిపించలేదని వారు తెలిపారు.
చలికాలం సమీపిస్తుండటంతో మరింత ఆందోళన
చలికాలం ప్రారంభమైతే దోమల బెడద మరింత పెరిగే అవకాశం ఉందని, దోమల కారణంగా చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ స్థలంలో నిల్వ ఉన్న మురుగునీటిని తొలగించడంతో పాటు అండర్డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి మురుగునీటి సమస్యను పరిష్కరించాలని, డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేసి కాలనీవాసులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.




