నాలుగు నెలలైనా యూనిఫామ్ అందలేదు..!

ఈ వార్తను షేర్ చేయండి:

విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా విద్యార్థులకు దుస్తులు కరువు – అధికారుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం

మాడుగుల, సెప్టెంబర్ 27 (తెలంగాణ గర్జన): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు పాఠశాల యూనిఫామ్‌లు అందకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు యూనిఫామ్‌ల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్‌లు అందించే చర్యలు చేపడుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అమలు తీరు ప్రశ్నార్థకంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు యూనిఫామ్‌లు అందాల్సి ఉండగా, నాలుగు నెలలు గడిచినా పంపిణీ జరగకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే సకాలంలో పంపిణీ చేయకపోవడంతో ప్రభుత్వ పథకాల ప్రయోజనం విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.
పాఠశాలలు ప్రారంభమై ఇంతకాలం గడిచినా యూనిఫామ్‌లు ఎందుకు అందలేదనే ప్రశ్నకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు వెంటనే యూనిఫామ్‌లు అందించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *