ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు వాటా కల్పించాలి
- డిప్యూటీ సీఎం మంత్రిత్వ శాఖలో రూ.300 కోట్ల కుంభకోణం
- కేటీఆర్ పాస్‌పోర్ట్‌పై రేవంత్ రెడ్డి చిల్లర లీకులు
- కోర్టులు లేఖలు రాయవు… ఆర్డర్లు ఇస్తాయి
- డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీఆర్ఎస్
తెలంగాణ భవన్, హైదరాబాద్, సెప్టెంబర్ 29 (తెలంగాణ గర్జన): ప్రజాపాలన పేరు మీద ప్రతీకార, దోపిడీ, దౌర్జన్య పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి పాలనలో లేనివాన్ని కొట్టి ఉన్నవాడికి పెట్టే కార్యక్రమం నడుస్తోందన్నారు. కేటీఆర్ సహా నలుగురి పాస్‌పోర్ట్ జప్తు అనే అంశంపై అవాస్తవాలు, ఊహాగానాలతో వార్తలు రాయొద్దని పత్రిక యజమానులకు విజ్ఞప్తి చేశారు. ఏసీబీ ప్రత్యేక కోర్టులు లేఖలు రాయవని, ఆర్డర్లు మాత్రమే ఇస్తాయని, ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి, మీడియా సంస్థలు తెలుసుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ లీగల్ నాయకులతో మాట్లాడానని, వారు ఎలాంటి లేఖలు రాలేదని చెప్పారని తెలిపారు. కేటీఆర్ గారికి ఎలాంటి నోటీస్ కూడా రాలేదని, కానీ ఏసీబీ కోర్టు లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయని, ఇది సరైంది కాదన్నారు.
కేటీఆర్ విదేశాలకు వెళ్లి ఏఐ వల్ల కలగబోయే నష్టాలు, తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి గురించి అద్భుతంగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీర్ణించుకోవడం లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తనలాగే కేటీఆర్ పాస్‌పోర్ట్ కూడా జప్తు చేయాలని, విదేశాలకు వెళ్లకుండా ఆపాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. 2015లో రేవంత్ రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా లంచం ఇస్తూ దొరికారని, కోర్టు ఆయన పాస్‌పోర్ట్ తీసుకుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన పాస్‌పోర్ట్ ఇప్పటికీ కోర్టు వద్దనే ఉందన్నారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ దేశానికి వెళ్లాలన్నా కోర్టు అనుమతి పొందాలని అన్నారు. అయితే కేటీఆర్ గారిది అలాంటి నేరం కాదని, పైగా కేటీఆర్ దర్యాప్తు సంస్థలకు సహకరిస్తూ విచారణకు హాజరవుతున్నారని, చట్టాన్ని పాటిస్తున్నారని చెప్పారు. ఫార్ములా ఈ కేసులో రూ.50 కోట్లలో ఒక్క రూపాయి కూడా తన సొంత అకౌంట్లోకి వెళ్లలేదని, అది తుఫేల్ కేసు అని ముందు నుంచే చెబుతున్నామని అన్నారు. కేటీఆర్ ఏనాడు విచారణకు సమయం కావాలని అడగలేదని, న్యాయస్థానం ఏనాడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని గానీ, అదుపులోకి తీసుకోవాలని గానీ చెప్పలేదన్నారు. సాక్షులను ప్రభావితం చేయడం, విదేశాలకు పారిపోవడం, ఇతరుల ప్రాణాలకు ప్రమాదం అని భావిస్తేనే కోర్టులు పాస్‌పోర్ట్ జప్తు చేస్తాయని అన్నారు. ఏసీబీ అధికారులు చట్ట ప్రకారం పని చేయాలని, రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలు పాటిస్తే భవిష్యత్‌లో చర్యలు తప్పవని హెచ్చరించారు. అందుకే మీడియా దయచేసి ఊహాగానాలు రాయవద్దని కోరారు.
చేవెళ్ల డిక్లరేషన్‌లో ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మల్లికార్జున ఖర్గేను తీసుకొచ్చి హామీ ఇచ్చారని, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం ఇస్తామన్నారని తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని సిద్ధరామయ్యను తీసుకొచ్చి నమ్మించారని అన్నారు. ఇరిగేషన్ శాఖలో రూ.4,000 కోట్ల టెండర్లు కేవలం ఇద్దరికే.. పొంగులేటి, మేఘా కృష్ణారెడ్డికే ఇచ్చారని, ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఫోర్త్ సిటీలో రూ.4,000 కోట్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే టెండర్లు బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు ఇచ్చారని, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం ఇవ్వలేదన్నారు. గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదలను మోసం చేసి, మఫత్‌లాల్, రమేష్ జైన్ వంటి వారికి కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. జీఐ ట్యాగ్ ఉన్న తాండూర్ కందిపప్పు ఇవ్వకుండా, ఆఫ్రికా నుంచి 50 కిలోల కందిపప్పు తెప్పించి నేకాఫ్ అనే సంస్థ ద్వారా, శ్రీనివాస్ రావు అనే మాఫియా డాన్‌తో రూ.900 కోట్ల టెండర్లు ఇచ్చారని, దీనిని వేం నరేందర్ రెడ్డి నడిపించారని ఆరోపించారు.
గతంలో బీఆర్ఎస్ హయాంలో ప్రతి టెండర్లో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 27 శాతం టెండర్లు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ గారి హయాంలో 33/11 సబ్‌స్టేషన్ నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీలకు రోస్టర్ విధానం ప్రకారం కాంట్రాక్టులు ఇచ్చేవారని, కాంట్రాక్టుల్లో ఈఎండీ కూడా రద్దు చేస్తూ జీవో నెం. 29 తెచ్చి అమలు చేశారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేదలు ఈ విధంగా బాగుపడ్డారని, కానీ కాంగ్రెస్ పాలనలో ఈ రోస్టర్ విధానం, రిజర్వేషన్ విధానం అమలు కావడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రూ.1,500 కోట్ల విలువైన 300 సబ్స్టేషన్ల నిర్మాణం చేస్తున్నారని, ఒక్కో సబ్‌స్టేషన్ కాకుండా 5, 6 సబ్స్టేషన్లు కలిపి ఒకే టెండర్ నోటిఫికేషన్ కింద విడుదల చేస్తున్నారని, దానివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంట్రాక్టులు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
దళిత ప్రేమికుడిని అని ఢంకా మోగిస్తున్న రేవంత్ రెడ్డి, స్పీకర్‌ను ఏమీ అనకుండానే అవమానించారని డప్పులు కొట్టిన కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మల్లు భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మరి ఈ ఎస్సీలు, ఎస్టీలు వారి బాధలు ఎవరికి చెప్పుకోవాలని, బాబాసాహెబ్, బాబు జగ్జీవన్ రాం, కాన్షీరాం, సంత్ సేవాలాల్, ఫూలేకు చెప్పుకోవాలా అని ప్రశ్నించారు. వేముల వీరేశం, మందుల సామేల్ ఎక్కడ పోయారని, డప్పులు పట్టుకొని భట్టి ఇంటి ముందుకు పోతరా అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో అన్ని కాంట్రాక్టులు కోమటిరెడ్డి పృథ్వీరెడ్డి ఒక్కరే చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలిచి డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన భట్టి హయాంలోనే ఇంత దారుణం జరుగుతోందన్నారు.
కేసీఆర్ గారు బ్యాంకు లింకేజీ లేకుండా, ఎలాంటి మధ్యవర్తి లేకుండానే రూ.4 వేల కోట్లు దళిత బంధు కింద ఎస్సీలకు ఇచ్చారని, ఎస్సీలను వ్యాపారవేత్తలుగా తయారుచేయడానికి కృషి చేశారని అన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో ఒక్క టెండర్ కూడా ఎస్సీ, ఎస్టీలకు రాకుండా నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. దీని గురించి అడుగుదామంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క ఎస్సీ, ఎస్టీ అధికారి కూడా లేరని, ఎస్సీ, ఎస్టీలు ముఖ్యమంత్రి ఆఫీసుకు రావద్దని రోజూ పసుపు నీళ్లు చల్లుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత కాంట్రాక్టర్లు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు డబ్బు ఇచ్చామని, అందుకే తమకు కాంట్రాక్టులు ఇస్తున్నారని, మీరు కూడా ఇవ్వండి అంటున్నారని పేర్కొన్నారు. ఎస్సీలకు కాంట్రాక్టులు రావాలంటే డబ్బులు ఇవ్వాలా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో పోలీసుల ఆరోగ్య భద్రత లేదని, నిన్న పెన్షనర్లు, కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించాలని భట్టి ఛాంబర్ ముందు ధర్నా చేశారని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ అమౌంట్ కూడా ఇవ్వడం లేదని, పోలీసుల సరెండర్ లీవ్‌లు కూడా విడుదల చేయడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలు క్లాస్-1 కాంట్రాక్టర్లు కావద్దా? ఎస్సీ, ఎస్టీలు కార్లలో తిరగద్దా? అని ప్రశ్నించారు. ఇంత అన్యాయం జరుగుతున్నా ఎస్సీ ఎమ్మెల్యేలు భట్టి ముందు ఎందుకు ధర్నా చేయడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి సొంత బంధువు రమేష్ రెడ్డికి క్రషర్ అనుమతి ఇవ్వడం లేదని, ఒక ఎస్సీ ఉద్యోగిపై ఏసీబీ కేసు పెట్టి జైలుకు పంపారని, అతనికి రూ.200 కోట్ల ఆస్తులున్నాయంటూ లీకులు ఇచ్చారని ఆరోపించారు. గొర్రెల పంపిణీలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందన్నారు, ఇప్పటికీ చార్జ్‌షీట్ వేయడం లేదని, 90 రోజుల్లోనే చార్జ్‌షీట్ వేయాలి కదా, ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు.
ప్యాకేజ్ విధానం రద్దు చేయాలని, గురుకులాల్లో సెంట్రలైజ్డ్ టెండర్లు, ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ రద్దు చేయాలని, అన్ని రంగాల్లోని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీల వాటా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అయ్యా భట్టి… తీసుకో ఇక చుట్టి
అలసిపోయినం మీకు కమీషన్ కట్టి కట్టి,
నమ్మి ఓటేస్తే వేశారు మా పై తట్టెడు మట్టి.
ఎట్లా కట్టాలె మా పల్లెలో రోజూ చిట్టి,
అప్పు కట్టమంటున్నడు మా ఊరి శెట్టి.
వచ్చే జన్మలోనైనా పోతదా మా ఈ వెట్టి.
మా భయ్యా భట్టి,
వట్టి మాటలు కట్టి పెట్టి,
తీసుకోండి ఇక చుట్టి.
అంటూ కవిత చెప్పారు.
ఎస్సీ, ఎస్టీలు వెలివాడ నుంచి బంజారాహిల్స్ రావాలనుకుంటే వారిని వెలివాడలోనే ఉండాలంటున్నారు భట్టి గారు అని అన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అధికారులు కూడా కాంట్రాక్టర్లకు సహకరించడం లేదని, ఏమి అడిగినా పై నుంచి ఫోన్ చేయించాలంటున్నారని తెలిపారు. అంటే ఉప ముఖ్యమంత్రికి ఇచ్చే కమీషన్లేనా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లు రూ.300 కోట్ల కమీషన్లు ఇవ్వలేరనే, వారి వాటా లేకుండా చేశారని, కమీషన్ల కోసం కాంట్రాక్టులు అన్నీ ఒక్కరికే కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గాల ప్రజలకు న్యాయం చేయలేని ఎమ్మెల్యేలు ఎస్సీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయకండి, జనరల్ స్థానాల నుంచి పోటీ చేసి గెలవాలని అన్నారు. 20 శాతం కమీషన్లు ఇచ్చినా బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారని, దీనిపై భట్టి గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు



