తుమ్మిడిహట్టి బ్యారేజీ అనుమతులకు చొరవ తీసుకోండి
- కేంద్ర జల్‌శక్తి మంత్రిని కలిసిన ముఖ్యమంత్రి
- తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులపై విస్తృత చర్చ
- కృష్ణా, గోదావరి బేసిన్ అంశాల ప్రస్తావన
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 (తెలంగాణ గర్జన): తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు త్వరగా లభించేలా కేంద్రం చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జల్‌శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌ను కోరారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రిని కలిసిన ముఖ్యమంత్రి, తెలంగాణకు సంబంధించిన కీలక నీటిపారుదల ప్రాజెక్టుల అంశాలను వివరించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని ఇప్పటికే అందించినట్లు తెలిపారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీని పూర్తి జలమట్టం 152 మీటర్ల స్థాయిలో నిర్మించేందుకు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య త్వరగా అవగాహన కుదిరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆ స్థాయిలో బ్యారేజీ నిర్మాణం జరిగితే గ్రావిటీ విధానంలో నీటిని ఎల్లంపల్లికి తరలించే అవకాశం ఉంటుందని వివరించారు. దీనివల్ల విద్యుత్ వినియోగం, నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్ బహుళార్థక ప్రాజెక్టు, గౌరవెల్లి రిజర్వాయర్‌కు పెండింగ్‌లో ఉన్న పర్యావరణ అనుమతులను త్వరగా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. అనుమతుల జాప్యం వల్ల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరుగుతోందని, అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయని వివరించారు.
సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం వద్ద పెండింగ్‌లో ఉన్న అనుమతులను కూడా త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు సమగ్ర నివేదికను ఇప్పటికే సమర్పించినట్లు పేర్కొంటూ, నీటిపారుదల ప్రణాళికలకు సంబంధించిన అంతర్రాష్ట్ర అనుమతులను త్వరగా మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిరభ్యంతర పత్రం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సిన టెలీమెట్రీ వ్యవస్థలను వేగవంతం చేయాలని కూడా ముఖ్యమంత్రి కోరారు. తొలి దశ టెలీమెట్రీ పరికరాల ఏర్పాటుకు అవసరమైన నిధులను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జమ చేసిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రెండో, మూడో దశల పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ కాకా వంశీ గడ్డం, రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో సాగునీటి వనరుల విస్తరణ, ప్రాజెక్టుల పూర్తి కోసం కేంద్రం సానుకూల సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.




