ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ శ్రేణులకు జైపాల్‌ యాదవ్‌ దిశానిర్దేశం

ఈ వార్తను షేర్ చేయండి:

హైదరాబాద్, అక్టోబర్ 2 (తెలంగాణ గర్జన): మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ సమావేశమయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని శ్రీలక్ష్మీ కన్వెన్షన్‌ హాల్‌లో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్‌ నాయకులు, యువజన నాయకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ శ్రేణులతో జైపాల్‌ యాదవ్‌ చర్చించారు. పార్టీ అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పట్టభద్రులు, యువత, ఉద్యోగులకు సంబంధించిన అంశాలను ఓటర్లకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించినట్లు తెలిపారు.

పట్టభద్ర ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని, నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలు, పట్టణాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని జైపాల్‌ యాదవ్‌ సూచించారు. అలాగే ప్రతి ఓటరును నేరుగా కలుసుకుని ఎన్నికల అంశాలను వివరించాలని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సమావేశంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గోలి శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పల వెంకటేష్‌, ఎడ్మ సత్యం, భాస్కర్‌రావు, విజితారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

కల్వకుర్తి పట్టణం, కల్వకుర్తి, చారకొండ, వెల్దండ, ఆమనగల్‌ పట్టణం, ఆమనగల్‌, తలకొండపల్లి, కడ్తాల్, మాడ్గుల మండలాలకు చెందిన మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సింగిల్‌ విండో చైర్మన్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ మార్కెట్‌ చైర్మన్లు, కమిటీ డైరెక్టర్లు, నాయకులు, యువజన నాయకులు తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *