పేరు సవరణకు నిబంధనల గందరగోళం.. ప్రజలకు తప్పని తిప్పలు
- పోలీస్ క్లియరెన్స్పై స్పష్టత లేక ఇబ్బందులు.. మార్గదర్శకాలు, చెక్లిస్ట్ అందించాలని విజ్ఞప్తి
మాడ్గుల, అక్టోబర్ 2 (తెలంగాణ గర్జన): పేరు, ఇంటిపేరు లేదా ఇతర వివరాల్లో తప్పులను సరిచేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న పలువురు నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. చిన్నతనంలో పాఠశాల రికార్డుల్లో జరిగిన పొరపాట్లు, ఆధార్ నమోదు సమయంలో దొర్లిన తప్పులు, జనన ధ్రువీకరణ పత్రాలు లేదా ఇతర అధికారిక పత్రాల్లో నమోదైన వివరాల వ్యత్యాసాలను సరిచేసుకునేందుకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
పేరు మార్పు లేదా సవరణ కోసం రెవెన్యూ కార్యాలయాన్ని ఆశ్రయించే దరఖాస్తుదారులకు అవసరమైన ధ్రువపత్రాల విషయంలో స్పష్టమైన సమాచారం అందకపోవడం సమస్యగా మారుతోందని పలువురు చెబుతున్నారు. ముఖ్యంగా తమపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని నిర్ధారించే పోలీస్ క్లియరెన్స్ లేదా సంబంధిత ధ్రువపత్రం తీసుకురావాలని కొందరు అధికారులు దరఖాస్తుదారులకు సూచిస్తున్నప్పటికీ, ఆ ధ్రువపత్రాన్ని ఎక్కడ, ఏ విధానంలో పొందాలో స్పష్టత లేకపోవడంతో వారు పోలీస్ స్టేషన్లను కూడా ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు.
అయితే పేరు మార్పు ప్రక్రియకు అవసరమైన నిర్దిష్ట ధ్రువపత్రం విషయంలో తమకు స్పష్టమైన మార్గదర్శకాలు అందుబాటులో లేకపోవడంతో పోలీస్ సిబ్బంది కూడా దరఖాస్తుదారులకు తగిన విధంగా సహాయం చేయలేకపోతున్న సందర్భాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. దీంతో ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిరుగుతూ దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేరు మార్పు ప్రక్రియలో అవసరమైన అన్నెక్సర్–2పై మండల రెవెన్యూ అధికారి సంతకం తదితర ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉండటంతో ఫైళ్లు ముందుకు సాగడానికి ఆలస్యం అవుతోందని దరఖాస్తుదారులు చెబుతున్నారు. తమపై కేసులు లేవని నిరూపించుకోవడానికి ఏ కార్యాలయాన్ని సంప్రదించాలి? ఏ ధ్రువపత్రం సమర్పించాలి? దరఖాస్తుతో పాటు ఇంకా ఏ పత్రాలు జత చేయాలి? అనే విషయాలపై స్పష్టత లేకపోవడంతో నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు అంటున్నారు.
స్పష్టమైన చెక్లిస్ట్ ఇవ్వాలని డిమాండ్
పేరు మార్పు, పేరు సవరణకు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలను దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని ప్రజలు కోరుతున్నారు. అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం, సంబంధిత అధికారుల ధ్రువీకరణ, పోలీస్ క్లియరెన్స్ అవసరమా లేదా అనే అంశాలను చెక్లిస్ట్ రూపంలో అందుబాటులో ఉంచితే ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు.
పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరి అయితే, ‘మీ సేవ’ వంటి నిర్దిష్ట సేవా విధానం ద్వారా దరఖాస్తు చేసుకునేలా స్పష్టమైన ప్రక్రియను రూపొందించాలని వారు కోరుతున్నారు. అలాగే పేరు మార్పుకు సంబంధించి పోలీసుల నుంచి ఏ ధ్రువపత్రం తీసుకోవాలనే విషయంపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పోలీస్ శాఖకు కూడా స్పష్టంగా తెలియజేయాలని సూచిస్తున్నారు.
రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య సమన్వయం పెంచి, దరఖాస్తుదారులకు అవసరమైన సమాచారాన్ని ఒకే చోట అందించే విధంగా చర్యలు తీసుకుంటే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితికి ముగింపు పలకవచ్చని ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న పలువురు అభిప్రాయపడుతున్నారు.




