రూ.300 కోట్ల భూమిపై వివాదం.. దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలి
- రేవంత్ రెడ్డి పాలనలో దళిత క్రైస్తవుల భూమి ఆక్రమణ
- సిఎం సహకారంతో 300 కోట్ల రియల్ ఎస్టేట్ దందా.
- భూ భారతిలో పేరున్నా కబ్జా దారులకే పోలీసుల మద్దతు
- వందల మంది గూండాలతో కలిసి మహిళలపై దౌర్జన్యం.
-డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,బిఆర్ఎస్.
జడ్చర్ల, అక్టోబర్ 3,(తెలంగాణ గర్జన): రేవంత్ రెడ్డి పాలనలో జడ్చర్లలోని 50 ఎకరాల విలువైన దళిత క్రైస్తవుల భూములను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జా చేస్తున్నారని బిఆర్ఎస్ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ రోజు మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో జడ్చర్లలో దళిత క్రైస్తవులను కలిశారు.
ఎలాంటి అధికారిక భూ పత్రాలు లేకపోయినా కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా చొరబడి ఎం.బి చర్చికి సంబందించిన భూమిలో ఉన్న కట్టడాలను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత వందేల్ల నుండి భూమి చర్చి యాజమాన్యం ఆధ్వర్యంలో ఉందని, ఆ భూమి బ్యాంకులో పెట్టి లోన్ కూడా తీసుకున్నారని,అది వందలాది మంది దళిత క్రైస్తవుల ఆస్తి అని స్పష్టం చేశారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు కూడా ఇదే దవాఖానలో జన్మించారన్నారు.
సుమారు 300 కోట్ల విలువైన భూమిని రేవంత్ రెడ్డి సహకారంతో,భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును కాలరాస్తూ, మహిళలపై దాడి చేసి దౌర్జన్యంగా భూమి ఆక్రమించి, వందల మంది రౌడీలతో భూమిలో పహారా కాస్తున్నారన్నారు.
ప్రభుత్వ వెబ్ సైట్ భూ భారతిలో ఎం.బి చర్చి పేరిట భూమి ఉన్నట్లు చూపిస్తున్నా,పోలీసులు మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు తెలపడం దుర్మార్గమన్నారు. భూ భారతిలో పేరు ఉన్నా ఓనర్లు కాదంటూ పోలీసులు వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు.
స్థానిక ఎమ్మార్వో లేదా రిజిస్ట్రేషన్ అధికారి నుండి ఎలాంటి పత్రాలు లేకపోయినా పోలీసులు ఆక్రమణదారులకే మద్దతు తెలుపుతున్నారన్నారు.
ఆక్రమణ దారులపై సరైన పత్రాలుంటే ఎందుకు చూపడంలేదని నిలదీశారు. పోలీసులే రెవెన్యూ అధికారుల్లాగా కోర్టు తీర్పు అంటూ చర్చి యాజమాన్యం మరియు దళిత క్రైస్తవులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
హోం మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే పోలీసులు ఆక్రమణ దారులకు మద్దతిస్తున్నారంటూ ఆరోపించారు. ఒక పక్క భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ, మరో పక్క ఆర్టికల్ 25,26,27,28 ప్రకారం ఉన్న మత పరమైన హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా ఈ భూమిలో చర్చి, క్రైస్తవుల సమాధులు ఉన్నాయని, ఆక్రమణ దారులకు ఎలాంటి కాగితాలు లేకపోయినా పోలీసులు ఏకపక్షంగా పని చేస్తున్నారన్నారు. ఇది పోలీసులు పరిష్కరించే సమస్య కాదని,రెవెన్యూ అధికారులు పరిశీలించి అన్ని రకాల చర్యలు తీసుకోని,బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కోర్టు ఆ భూమి ప్రైవేట్ వ్యక్తికే చెందుతుందని ఎక్కడా చెప్పలేదని,కేవలం వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలని మాత్రమే చెప్పిందన్నారు. పోలీసులు ఆ భూమి ఎవరిదో తేల్చాలని ఎమ్మార్వో కు ఎందుకు లేఖ రాయలేదని నిలదీశారు.ప్రభుత్వ లాయర్లతో మాట్లాడి ఆ భూమి గురించి వివరాలు అడిగి అసలైన యజమానిని గుర్తించాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ, ఈ స్థలంలో ఉండే హాస్పిటల్ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ విశిష్ట సేవలు అందించిందన్నారు.తాను కూడా ఇదే దవాఖానలో జన్మించానని,గత వందేళ్లుగా ఈ స్థలం ఎం.బి చర్చి ఆధ్వర్యంలోనే ఉందని స్పష్టం చేశారు.
ఇరు పక్షాల సమక్షంలో సమస్య పరిష్కరించకుండా,ఒక వర్గానికే పోలీసు అధికారులు వంత పాడడం అన్యాయమన్నారు.
బిఆర్ఎస్ పార్టీ కబ్జా దారులకు వ్యతిరేకంగా దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని హెచ్చరించారు. బాధిత మహిళను పరామర్శించి మద్దతు తెలిపారు.




