మహిళలపై వేధింపులకు బీజేపీ, కాంగ్రెస్‌లది ఒకే సంస్కృతి
- పద్మిని కేసులో సిట్ ఏర్పాటు చేయాలి.. సాయి ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
- ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్, అక్టోబర్ 07 (తెలంగాణ గర్జన ప్రతినిధి): మహిళలపై వేధింపుల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలది ఒకే సంస్కృతి అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు డి. పద్మిని కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పద్మిని కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ యువమోర్చా జాతీయ ట్రెజరర్ టి.ఎం. సాయి ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. బాధితురాలి ఫిర్యాదులో తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ సాధారణ సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
ఆధారాలతో మాట్లాడుతున్నాం
తాము ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం లేదని డా. ప్రవీణ్ కుమార్ అన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు స్పందించాలని, రాజకీయ ఆరోపణలకు బదులుగా సైబర్ క్రైమ్ కేసులు పెట్టి తమ గొంతును అణచివేయడానికి ప్రయత్నించవద్దని సూచించారు. పద్మిని ఇటీవల అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. అయితే ఆమె ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. బాధితురాలి స్టేట్మెంట్తో పాటు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను వెంటనే నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
పద్మినికి న్యాయం చేయాలి
పద్మిని రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో బీజేపీ నాయకులతో కలిసి పనిచేశారని, ఈ క్రమంలో పదవులు, పోస్టింగుల పేరుతో ఆమెను వివిధ రకాలుగా ఉపయోగించుకున్నారని డా. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆమెను లైంగికంగా వేధించడం, కులం పేరుతో అవమానించడం, ఏఐ ద్వారా ఫేక్ ఫొటోలు వైరల్ చేస్తానని బెదిరించడం, రాత్రి వేళల్లో ఫోన్ చేసి ఇబ్బందులకు గురిచేయడం వంటి ఆరోపణలను ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ఈ ఆరోపణలన్నింటిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళల భద్రతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి
తెలంగాణలో ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న నాయకులపైనే మహిళల వేధింపుల ఆరోపణలు వస్తే బాధితులు ఎవరిని ఆశ్రయించాలనే ప్రశ్న తలెత్తుతోందని అన్నారు. మహిళల భద్రత విషయంలో డీజీపీ, డీజీ ఉమెన్ సేఫ్టీ, మహిళా కమిషన్ తక్షణమే స్పందించాలని కోరారు. పద్మిని కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, తీసుకున్న చర్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై చర్యలు తీసుకోవాలి
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై కూడా మహిళతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయని డా. ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మహిళా భద్రతకు సంబంధించిన అంశాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని అన్నారు.
ఆ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని పిలిపించి వివరణ కోరాలని అన్నారు.
లక్షలాది పోలీస్ కుటుంబాల తరఫున కేటీఆర్‌కు కృతజ్ఞతలు
కిమ్స్ ఆసుపత్రిలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై చికిత్స పొందుతున్న దేవసోత్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలుసుకుని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చేసిన ట్వీట్‌పై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, దేవసోత్ శంకర్ కుటుంబానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ సందర్భంగా లక్షలాది పోలీస్ కుటుంబాల తరఫున కేటీఆర్‌కు డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ మహిళల పక్షాన నిలుస్తుంది
బాధితురాలు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా, ఆమెకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ ప్రశ్నిస్తుందని డా. ప్రవీణ్ కుమార్ అన్నారు. మహిళలకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా బీఆర్ఎస్ 3.0 పాలన ఉంటుందని ఆయన పేర్కొన్నారు.



