ఫిరోజ్ నగర్ పలుగురాళ్ళ మైనింగ్ అక్రమమా? సక్రమమా?

ఈ వార్తను షేర్ చేయండి:

మైనింగ్ అనుమతులు బయటపెట్టాలి – ఫిరోజ్ నగర్ సర్పంచ్ జంగమ్మ శ్రీను

మాడ్గుల,అక్టోబర్ 11(తెలంగాణ గర్జన): మాడ్గుల మండలంలోని ఫిరోజ్ నగర్ గ్రామంలో గత కొద్దీ నెలలుగా జరుగుతున్న పలుగురాళ్ళ మైనింగ్ ఇప్పుడు ఫిరోజ్ నగర్ చుట్టుపక్కన గ్రామాల్లో చర్చకు దారితీసింది. ఆ మధ్య కొంతమంది సామాజిక కార్యకర్తలు ఈ మైనింగ్ కార్యక్రమాలపై సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం చేయగా మైనింగ్ కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపివేసి, ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టినట్లు గ్రామస్థులు అంటున్నారు. ఒక్కోరోజు దాదాపు 10 టిప్పర్ల పలుగురాళ్ళు రవాణా అవుతున్నట్లు గ్రామస్థులంటున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫిరోజ్ నగర్ స్కూల్ వదిలిన సమయంలో వరుసగా టిప్పర్లు రావటం కి సంబంధించిన వీడియో కూడా చక్కర్లు కొట్టింది.

మైనింగ్ కి ఎటువంటి పర్మిషన్ ఉందో చూపెట్టాలని ఫిరోజ్ నగర్ సర్పంచ్ కలకొండ జంగమ్మ శ్రీను సంబంధిత వ్యక్తులను కోరగా ఇంతవరకు ఎటువంటి పత్రాలను చూపెడ్తలేరని, వారు పర్మిషన్ తీసుకున్నది చేస్తున్న కార్యకలాపాలు వేరేవిదంగా ఉన్నట్లు అనుమానం వస్తుందని సర్పంచ్ అన్నారు. మైనింగ్ పనులు జరిగే ప్రాంతం నుండి ఫిరోజ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 500 మీటర్ల లోపే ఉందని, స్కూల్ వదిలే సమయంలో మైనింగ్ టిప్పర్లు అతివేగంగా వెళ్ళటం వలన విద్యార్థులు భయబ్రాంతులకు గురౌతున్నారని, విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళనకు గురౌతున్నారని సర్పంచ్ అన్నారు. మైనింగ్ కార్యక్రమాలు నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నట్లుగా లేవని సర్పంచ్ జంగమ్మ శ్రీనివాస్ అన్నారు. ఒకవేళ సరైన అనుమతులు ఉంటే స్కూల్ ప్రారంభానికి ముందు , స్కూల్ వదిలే సమయంలో పలుగురాళ్ళ ట్రక్ లు తిరగకుండా చూడాలని, స్కూల్ నడుస్తున్న సమయం లో బ్లాస్టింగ్ జరగకుండా చూడాలని, పలుగు రాళ్ళ బ్లాస్టింగ్ , ఆతర్వాత వెలువడే కంటికి కనపడని ‘స్ఫటికాకార సిలికా ధూళి’ పీల్చుకోవటం ద్వారా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వస్తాయి కాబట్టి ఆ గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు ప్రతి సంవత్సరం చేయించాలి అవసరం అయితే వారికి ఆరోగ్య భీమా చేయించాలని, పలుగురాళ్ళ పెద్ద ట్రక్ లు గ్రామం లో తిరగటం వల్ల రోడ్లు త్వరగా ఖరాబు అయితాయి కాబట్టి వాటిని రిపేర్ చేసుకోవటానికి గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వాలని, ఒక వేళ బ్లాస్టింగ్ వల్ల ఇళ్ళకు పగుల్లు వస్తే వారికి నష్టపరిహారం ఇవ్వాలని, మైనింగ్ ప్రాంతం వెనక వున్న రైతులు వారి భూములకు వెళ్ళేందుకు బాటను ఇచ్చి దానిని గ్రామ పంచాయతీ కి రిజిస్ట్రేషన్ చేయించాలని, మైనింగ్ చుట్టుపక్కన భూముల రైతుల భూములు బ్లాస్టింగ్ వల్ల , లేదా దుమ్ము ధూళి వల్ల ఖరాబ్ అవుతున్నాయి, భూ ప్రకంపనల వల్ల బోర్లకు నష్టం వాటిల్లవచ్చు కాబట్టి వారికి ప్రతిసంవత్సరం ఎంతో కొంత వారికి మానవతా దృక్పధంతో నష్టపరిహారం లాగ చెల్లిస్తే వారి భయాన్ని పోగొట్టి భరోసా కల్పించినవారౌతారని, భూప్రకంపనలు 5 మిల్లిమీటర్ కంటే ఎక్కువ జరగటం లేదు అని తెలిపే వైబ్రేషన్స్ మానిటర్ స్థానిక గ్రామపంచాయతీలో ఉంచితే గ్రామ ప్రజలకున్న ప్రకంపనల భయాలను, అనుమానాలను పోగొట్టవచ్చని సర్పంచ్ జంగమ్మ శ్రీను అన్నారు. ఈ మైనింగ్ అనుమతులు, నిబంధనలు పాటిస్తున్నారా అని మైనింగ్, రెవిన్యూ అధికారులు పరిశీలించకపోతే గ్రామాలు కాలుష్య కాసారాలుగా మారి,పచ్చటి పల్లెలు ‘దయ్యాల దిబ్బలుగా’ మారే ప్రమాదం ఉందని గ్రామ సర్పంచ్ జంగమ్మ శ్రీను అన్నారు. అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *