బతుకమ్మతో యువతకు బంగారు అవకాశం
- ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రత్యేక ఆహ్వానం
- సృజనాత్మక ప్రతిభకు ప్రోత్సాహం
- తెలంగాణ సంస్కృతి ప్రచారమే లక్ష్యం
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (తెలంగాణ గర్జన): యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026లో భాగంగా ఇన్ఫ్లుయెన్సర్ల సమావేశం సోమవారం హైదరాబాద్లోని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, మేనేజింగ్ డైరెక్టర్ ఎం. ముకుంద రెడ్డి, ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ కొండా రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ సృష్టికర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ లక్ష్యాలు, పోటీ విధివిధానాలు, వివిధ విభాగాలు, పాల్గొనే అవకాశాలపై సమగ్రంగా వివరించారు. యువ సినీ సృష్టికర్తలు, డిజిటల్ కంటెంట్ తయారీదారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇది మంచి వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ పండుగ విశిష్టతను ఆధునిక సాంకేతిక వేదికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర ఎంతో కీలకమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజాపాలన కార్యక్రమాలపై అవగాహన కల్పించే విధంగా సృజనాత్మక దృశ్య కథనాలను రూపొందించాలని సూచించారు.
ఇన్ఫ్లుయెన్సర్ల విభాగంలో ప్రభుత్వ పథకాలు, సామాజిక అంశాలు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిన్న చిత్రాలు, దృశ్య కథనాలు, సామాజిక మాధ్యమాల కోసం ప్రత్యేక కంటెంట్ రూపొందించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సృజనాత్మకతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ, సినీ నటుడు రచ్చ రవి, పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ సృష్టికర్తలు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో యువ ప్రతిభను ప్రోత్సహించే ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు.




