రోడ్డు తవ్వి వదిలేశారు.. ప్రజలకు తిప్పలు!

ఈ వార్తను షేర్ చేయండి:
  • రెడ్డిపురం–గంగ్యానగర్ తండా బీటీ రోడ్డు పనులు ఎప్పుడు పూర్తవుతాయో?

మాడుగుల,సెప్టెంబర్ 27(తెలంగాణ గర్జన): రెడ్డిపురం నుంచి గంగ్యానగర్ తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ పనులు నత్తనడకన సాగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు సంవత్సరం క్రితం రోడ్డు పనుల పేరుతో రహదారిని తవ్వి వదిలేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు తవ్విన అనంతరం పనులు ముందుకు సాగకపోవడంతో గుంతలు, మట్టి రోడ్డు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసిన సమయంలో రహదారి బురదమయంగా మారి నడవడానికి కూడా ఇబ్బందికరంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే పనులు నిలిచిపోయాయా?
ప్రభుత్వం రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ పనులను ప్రారంభించి మధ్యలోనే నిలిపివేయడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు తవ్వి వదిలేయడంతో సమస్య మరింత తీవ్రమైందని, కనీసం తాత్కాలికంగా రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తక్షణమే పనులు పూర్తి చేయాలి
రెడ్డిపురం–గంగ్యానగర్ తండా మధ్య రహదారి అనేక గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు పనులను వెంటనే పునఃప్రారంభించి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి ప్రజల అవస్థలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *