రంగారెడ్డి జిల్లాలో ‘బంగారు బాతు’ ఎక్సైజ్ స్థానం ఎవరిది..?

ఈ వార్తను షేర్ చేయండి:
  • ఎక్సైజ్ పోస్టింగ్ కోసం ‘పైరవీల’ వేట..!
  • ఆ స్థానం కోసం లక్షల ఖర్చు.. నెలకు లక్షల ఆశలు..!
  • మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారి ఎవరు..?
  • ‘గోల్డెన్ పోస్టింగ్’ కోసం భారీ పైరవీలు..!
  • జీతం లక్షల్లో.. ఆదాయం మాత్రం కోట్లలోనా..?
  • వైన్స్ నుంచి బెల్ట్ షాపుల దాకా.. ఆ సిఐ మామూళ్ల మాయాజాలం
  • రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ ‘గోల్డెన్ చైర్’ ఎవరిది..?
  • ఆ నియోజకవర్గ ఎక్సైజ్ పోస్టుపై ఎందుకంత మోజు..?

రంగారెడ్డి,సెప్టెంబర్ 28 (తెలంగాణ గర్జన డెస్క్): రంగారెడ్డి జిల్లాలోని ఓ నియోజకవర్గం ఎక్సైజ్ శాఖలో అధికారుల పోస్టింగ్‌పై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మినీ ఇండియాగా పేరొందిన ఈ నియోజకవర్గంలో ఎక్సైజ్ శాఖ అధికారిగా పనిచేసేందుకు కొందరు అధికారులు తీవ్రంగా ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పోస్టింగ్ కోసం పెద్ద ఎత్తున పైరవీలు, ముడుపుల వ్యవహారం నడుస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో ఎక్సైజ్ శాఖ పరిధిలోని వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు, బెల్ట్ దుకాణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అక్కడ పనిచేసే అధికారులకు భారీగా అక్రమ ఆదాయం వస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు ఎక్సైజ్ సిఐ వైన్స్, కల్లు దుకాణాలు, బెల్టు షాపుల నుంచి ఒక్కింటికి నెలకు సుమారు రూ.20 వేల చొప్పున, బార్ల నుంచి రూ.50 వేల చొప్పున మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్లు దుకాణాలు, బెల్ట్ దుకాణాలు, అనుమతి లేని వ్యాపారాల నుంచి కూడా నెలసరి వసూళ్లు జరుగుతున్నాయని స్థానికంగా చర్చ సాగుతోంది.
దాదాపు మూడు పదుల వరకు వైన్స్ దుకాణాలు, 90కి పైగా కల్లు దుకాణాలు, ఇతర బెల్ట్ దుకాణాలు కలిపి నెలకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మామూళ్లు వస్తున్నాయనే ప్రచారం ఉంది. అయితే ఈ వసూళ్లకు సంబంధించి అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఇక కేసుల పేరుతో జరిగే వసూళ్లు, అనుమతులు లేని వ్యాపారాలపై చర్యలు తీసుకుంటామని చెప్పి జరిగే వ్యవహారాలు కలిస్తే ఆదాయం మరింత పెరుగుతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో సాధారణ వేతనంతో పోలిస్తే అక్రమ మార్గాల్లో వచ్చే ఆదాయం భారీగా ఉంటుందనే చర్చ అధికార వర్గాల్లోనూ, స్థానికంగా కూడా సాగుతోంది.వ ఈ నేపథ్యంలోనే సదరు ఎక్సైజ్ కార్యాలయంలో పనిచేసేందుకు కొందరు అధికారులు భారీగా ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టింగ్ కోసం పెట్టిన ఖర్చుతో పోలిస్తే పనిచేసే కాలంలో వచ్చే అక్రమ ఆదాయం అనేక రెట్లు ఉంటుందనే భావనతోనే ఈ ‘పోస్టింగ్ వేట’ సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఆ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు ఎక్సైజ్ శాఖలో అధికారుల నియామకాలు, అక్రమ మద్యం వ్యాపారాలు, మామూళ్ల ఆరోపణలపై తగినంత దృష్టి పెట్టడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఎక్సైజ్ శాఖలో అధికారులదే ఇష్టారాజ్యమనే ఆరోపణలకు బలం చేకూరుతోందని స్థానికులు అంటున్నారు. ఎక్సైజ్ శాఖలో పోస్టింగ్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారనే అంశంపై స్పష్టత లేకపోయినా, ‘పెట్టుబడి పెట్టి పోస్టింగ్ తెచ్చుకోవడం.. తర్వాత వసూళ్లతో పెట్టుబడిని రాబట్టుకోవడం’ అనే వ్యవహారం నడుస్తోందనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా గత ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోనూ ఈ ప్రాంతంలోని ఎక్సైజ్ పోస్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందనే చర్చ ఉంది. దీంతో అసలు ఈ ‘గోల్డెన్ పోస్టింగ్’ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి..? పోస్టింగ్ కోసం నిజంగానే పైరవీలు, ముడుపుల వ్యవహారం జరుగుతోందా..? నెలకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మామూళ్లు వసూలవుతున్నాయన్న ఆరోపణల్లో వాస్తవమెంత..? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అధికారుల సమగ్ర విచారణ జరిగితేనే ఈ ఆరోపణల్లో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *