జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు 13 మంది ఎంపిక
నల్లగొండ, సెప్టెంబర్ 30 (తెలంగాణ గర్జన): నల్లగొండ జిల్లాలో నిర్వహించిన నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ (NIDJAM) జిల్లా స్థాయి పోటీల్లో సుమారు 180 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బుధవారం నిర్వహించిన ఈ పోటీలను ఏరియా కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్, జిల్లా యువజన క్రీడల అధికారి (DYSO) అక్బర్ అలీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల్లో 13 మందిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు నవంబర్ 13, 14, 15 తేదీల్లో సంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.

జిల్లా స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా అల్లి సుభాష్ యాదవ్, అక్బర్ అలీ మాట్లాడుతూ ఎంపికైన క్రీడాకారులు జాతీయస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మాచర్ల జగ్జీవన్, ప్రధాన కార్యదర్శి శంభులింగం, కోశాధికారి పవన్ కుమార్, గౌరవ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



