మూడేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి సంపాదన 50 వేల కోట్లు – డా.ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్
నల్లగొండ, అక్టోబర్ 8 (తెలంగాణ గర్జన): రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి భారీ సంఖ్యలో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. నల్లగొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు 500 కోట్లు ఖర్చు చేసినా గెలుపు సాధ్యం కాదు: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకొని, అక్రమంగా 50 వేల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. గతంలో కేసిఆర్ ఎస్సీ పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కార్లలో తిరగాలని దళిత బంధు పథకాన్ని అమలు చేసి పేదలకు సహాయం చేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం సతీమణి పేరు మీద కార్ల షోరూంలు పెట్టుకున్నారని విమర్శించారు. అంతేకాకుండా గత ముఖ్యమంత్రి కేసిఆర్ ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనారిటీ పేద వర్గాల కోసం వెయ్యి గురుకులాలు పెట్టి నాణ్యమైన విద్యను అందిస్తే, రేవంత్ రెడ్డి తన కూతురు పేరు మీద హైదరాబాద్ చుట్టుపక్కల మైండ్ వాల్ట్ పేరు మీద ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. గత ప్రభుత్వం పేదల కోసం అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు మరియు ప్రభుత్వ కార్పొరేట్ హాస్పిటల్స్ నిర్మిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవాలకు హాజరై, ప్రమోట్ చేసి, చివరకు 3200 కోట్లకు అమ్మారని గుర్తు చేశారు. ఈ హాస్పిటల్ డైరెక్టర్ గా రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణ రెడ్డి ఉన్నారని, ఈ విధంగా రేవంత్ రెడ్డి అక్రమంగా సంపాదించిన 50 వేల కోట్లలో 500 కోట్లు ఖర్చు చేసినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలువరన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులకు 8 వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు బాకీ పడ్డారని, ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మోసం చేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగుల సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కలిసి నల్గొండ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వకుండా, కోమటి రెడ్డి పృథ్వీ రెడ్డికి ఇచ్చారని, కమీషన్ల కోసం భట్టి, వెంకట్ రెడ్డి పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు ఉప ముఖ్యమంత్రి భట్టికి కమీషన్లు కట్టలేక,ఇంట్లో చిట్టీలు కట్టలేకపోతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కమీషన్ల రూపంలో సంపాదించిన నల్లధనాన్ని, తెల్లధనంగా మార్చుకోవడానికి,కుటుంబ సభ్యుల పేరు మీద కంపెనీలు, పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి అక్రమ సంపాదన,మరియు దోపిడీ గురించి ప్రశ్నిస్తే బిఆర్ఎస్ నాయకులను జైలుకు పంపాలని చూస్తున్నారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్కు అత్యంత కీలకమని, ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డిని గెలిపించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని కోరారు. ప్రతి రెండు రోజులకోసారి కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించి ఓటర్ల నమోదు ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు వరకు నల్లగొండను ఓటరు నమోదులో మొదటి స్థానంలో నిలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని అమలు చేయలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎంత డబ్బు ఖర్చు చేసినా పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించలేదని ఆయన వ్యాఖ్యానించారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా మేధావి రాకేష్ రెడ్డిని గెలిపిద్దాం
ఎమ్మెల్సీ ఎన్నికలను రాబోయే రాజకీయ పోరాటానికి ‘క్వార్టర్ ఫైనల్స్’ గా అభివర్ణించిన ఆయన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి, ఆ తర్వాత సెమీ ఫైనల్స్, ఫైనల్స్ దిశగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారని, ఈసారి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ కోరారు. బిట్స్ పిలానీలో విద్యనభ్యసించిన రాకేష్‌రెడ్డి విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని అన్నారు. పట్టభద్రుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించగల మేధావి నాయకుడికి అవకాశం కల్పించాలని పిలుపునిచ్చారు.
గత పొరపాట్లు పునరావృతం కాకూడదు: ఏనుగుల రాకేష్‌రెడ్డి
బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో తనను కేవలం 14 రోజుల ముందు అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ గట్టిపోటీ ఇచ్చానన్నారు. అయితే ప్రత్యేకంగా పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడంలో జరిగిన లోపం వల్ల నష్టం జరిగిందని తెలిపారు. ఈసారి ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రతి అర్హత కలిగిన పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని కోరారు. తాను ఎల్లప్పుడూ పట్టభద్రులకు అందుబాటులో ఉంటానని, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని రాకేష్‌రెడ్డి తెలిపారు.
పట్టభద్రుల ఎన్నికల్లో సత్తా చాటాలి: కంచర్ల భూపాల్‌రెడ్డి
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టభద్రుల ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పాలని అన్నారు. గ్రామాలు, డివిజన్ల వారీగా పార్టీ నాయకులు విస్తృతంగా పర్యటించి అర్హులైన పట్టభద్రులను పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలకాలని ఆయన ఆకాంక్షించారు. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి: బండా నరేందర్‌రెడ్డి
బీఆర్ఎస్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గంలో ఏనుగుల రాకేష్‌రెడ్డికి భారీ మెజార్టీ వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ కటికం సత్తయ్యగౌడ్, చకిలం అనిల్‌కుమార్, మాలే శరణ్యరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్‌వలి, రేగట్టె మల్లికార్జునరెడ్డి, మందడి సైదిరెడ్డి, తండు సైదులుగౌడ్, అభిమన్యు శ్రీనివాస్, మైనం శ్రీనివాస్, కంచనపల్లి రవీందర్రావు, నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మండల పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్య, పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, దేప వెంకట్‌రెడ్డి, తోటి శ్రీనివాస్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి నాయకుడు బొమ్మరబోయిన నాగార్జునతో పాటు పలువురు పట్టభద్రులు పాల్గొన్నారు.




