డిండి లిఫ్ట్‌ను రద్దు చేయాలి.. పాలమూరు రైతాంగాన్ని కాపాడాలి!
ఈ నెల 17న కల్వకుర్తిలో మహాధర్నా.. విజయవంతం చేయాలని జేఏసీ నేతల పిలుపు
మాడ్గుల, అక్టోబర్ 13 (తెలంగాణ గర్జన): డిండి లిఫ్ట్‌లో భాగంగా ఇర్విన్‌లో నిర్మిస్తున్న రిజర్వాయర్‌ను రద్దు చేయాలని, పాలమూరు రైతాంగానికి న్యాయం చేయాలని మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ, కల్వకుర్తి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధన కోసం ఈ నెల 17న కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఇర్విన్‌లో రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో జేఏసీ నాయకులు రాజేందర్ రెడ్డి, రాఘవచారి, చెన్నకిష్టయ్య, తిమ్మప్ప, ఖలీల్, కల్వకుర్తి జేఏసీ నాయకులు కానుగుల జంగయ్య, సదానందం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాకు నీటిని తరలించేందుకే డిండి లిఫ్ట్‌ను చేపడుతున్నారని, దీనివల్ల పాలమూరు ప్రాంత రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సాగునీటి కోసం ఎదురుచూస్తున్న పాలమూరు రైతులకు అన్యాయం చేసే విధానాలను ప్రభుత్వం విడనాడాలని కోరారు. డిండి లిఫ్ట్‌ను రద్దు చేసి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలి అని వారు డిమాండ్ చేశారు. ఇర్విన్ రిజర్వాయర్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి, వారి ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. డిండి లిఫ్ట్ రద్దు అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 17న కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోరాటం పాలమూరు రైతాంగ హక్కుల పరిరక్షణకు సంబంధించినదని పేర్కొంటూ, రైతులంతా ఐక్యంగా ముందుకు వచ్చి మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతులు జంగయ్య యాదవ్, బొడ్డు శంకర్, జార్జి రెడ్డి, భూపేష్, తుప్పలయ్య, కొప్పుల శ్రీను, కడారి అల్లాజీ, కడారి కమలేష్, కొప్పుల శివరాజ్, కడారి బుచ్చయ్య, కంచుకట్ల లక్ష్మయ్య, సూదిని అంజన్ రెడ్డి, పందుల లక్ష్మయ్య, గుండె శ్రీశైలం, మామిడి వెంకటయ్య, మాదాసు మొగులయ్య, కేశమోని రామచంద్రం, కడారి మొగులయ్య, కడారి మల్లయ్య, కడారి పర్వతాలు, రాజమోని వెంకటయ్య, రాజమోని రమేష్, రాజమోని శ్రీను తదితర రైతులు పాల్గొన్నారు.




