సర్వే నంబర్ 206 పునరావాస భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఎత్తివేయాలి
- -ప్రజా పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్స్వామి
నల్లగొండ, సెప్టెంబర్ 28 (తెలంగాణ గర్జన): చిత్రియాల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 206లో పునరావాస భూముల రిజిస్ట్రేషన్లపై విధించిన నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్స్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు చిత్రియాల, పెదమూల, నల్లశిలమూల గ్రామాలకు చెందిన బాధిత రైతులతో కలిసి నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు మెమోరాండం సమర్పించారు.
ఈ సందర్భంగా నూనె వెంకట్స్వామి మాట్లాడుతూ.. 1972లో నాగార్జునసాగర్ రిజర్వాయర్ ముంపునకు గురైన రైతులకు పునరావాసం కల్పించేందుకు సర్వే నంబర్ 206లోని 9,600 ఎకరాల అటవీ భూమిలో 2,061.28 ఎకరాలను రెవెన్యూ భూమిగా మార్చినట్లు తెలిపారు. అందులో 1,240.29 ఎకరాలకు పునరావాస రైతుల పేరిట పట్టాలు జారీ చేశారని పేర్కొన్నారు. అనంతరం 2007లో మరో 800 ఎకరాలకు అసైన్డ్ పట్టాలు పంపిణీ చేయగా, అప్పటి నుంచి రైతులు ఆ భూములను సాగు చేసుకుంటున్నారని తెలిపారు.
అయితే 2018లో కొందరు తహసీల్దార్లు, వీఆర్వోలు మిగిలిన 7,600 ఎకరాల భూముల్లో అక్రమంగా పట్టాలు సృష్టించి స్థానికేతరులకు కట్టబెట్టినట్లు ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకున్నప్పటికీ, మొత్తం సర్వే నంబర్ 206ను ప్రభుత్వం పూర్తిగా లాక్ చేయడం వల్ల పునరావాస రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
పునరావాస రైతులకు చెందిన భూముల రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధాన్ని తొలగించి, వారి సమస్యలను పరిష్కరించాలని నూనె వెంకట్స్వామి కోరారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీఓ తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.



