సింగంపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలి

ఈ వార్తను షేర్ చేయండి:

ప్రజలు, విద్యార్థులు, మహిళల ఇబ్బందులు తొలగించాలని వినతి

ఆమనగల్లు సెప్టెంబర్ 28 (తెలంగాణ గర్జన): ఆమనగల్లు మండలంలోని సింగంపల్లి గ్రామానికి అనుకూల సమయాల్లో బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం గ్రామానికి ఒక బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ, అది రాత్రి సుమారు 10 గంటలకు గ్రామానికి చేరుకుని, ఉదయం 5 గంటలకు తిరిగి వెళ్తుండటంతో విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, గ్రామ ప్రజలకు పెద్దగా ఉపయోగపడటం లేదని వారు తెలిపారు.

ప్రధానంగా ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య, అలాగే సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య బస్సు సర్వీసులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సమయాల్లో బస్సు సౌకర్యం ఉంటే విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు, ఉద్యోగులు తమ పనులకు వెళ్లేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

అలాగే మాల్ నుంచి ఆమనగల్లు వచ్చే బస్సు ప్రస్తుతం గ్రామ క్రాస్‌ రోడ్ మీదుగా వెళ్తుందని, ఆ బస్సును సింగంపల్లి గ్రామంలోకి మళ్లిస్తే సుమారు రెండు కిలోమీటర్ల అదనపు దూరం మాత్రమే పెరుగుతుందని గ్రామస్థులు తెలిపారు. ఈ విషయాన్ని అధికారులు పరిశీలించి, సాధ్యమైన మార్గాల్లో గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామ సర్పంచ్ సనమోని సత్యం ఆధ్వర్యంలో ఆమనగల్లు మండల అభివృద్ధి అధికారి జయరాం విజయ్ కి వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అయోధ్య, ప్రభాకర్, నగేష్, మనీ, వెంకటేష్, మల్లేష్, తానేష్, కృష్ణయ్య, శ్రీశైలం, యాదయ్య, వెంకటయ్య, భాస్కర్, తానేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *