కృష్ణమాచారికి న్యాయం చేయాలి

ఈ వార్తను షేర్ చేయండి:

విశ్వకర్మ సంఘం నాయకుల డిమాండ్

మాడ్గుల, సెప్టెంబర్ 28 (తెలంగాణ గర్జన): మాడ్గుల మండలంలోని ఆర్కపల్లి గ్రామానికి చెందిన ముకురోజు కృష్ణమాచారిపై జరిగిన దాడి ఘటనపై విశ్వకర్మ సంఘం నాయకులు తీవ్రంగా స్పందించారు. బాధితుడికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి కృష్ణమాచారి హాజరైన సమయంలో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆయనపై దాడికి పాల్పడటం బాధాకరమని సంఘం నాయకులు పేర్కొన్నారు. గ్రామానికి చెందిన ఓ నాయకుడి అండదండలతో ఏర్పుల మైసయ్య, తోలు వెంకటయ్యలు కృష్ణమాచారి వద్దకు వెళ్లి దుర్భాషలాడుతూ దాడి చేసినట్లు వారు ఆరోపించారు.

బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు, ఘటనకు ప్రోత్సాహం అందించినట్లు ఆరోపణలు ఉన్న వ్యక్తుల పాత్రపై కూడా విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

బాధితుడు కృష్ణమాచారికి తగిన రక్షణ కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వకర్మ సంఘం నాయకులు కోరారు. ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా విశ్వకర్మల సంఘం యువజన విభాగం అధ్యక్షులు ఇర్వింటి భూపేష్ చారి, మాడ్గుల మండలం మనమయ సంఘం అధ్యక్షులు మల్లోజు బిక్షపతి చారి, ఉపాధ్యక్షులు కాసోజు జంగా చారి, కోశాధికారి రంగాచారి, గౌరవాధ్యక్షులు విశ్వరూప చారి, గౌరవ సలహాదారులు ఇర్వింటి శ్రీనివాస చారి, కాసోజు కనకాచారి, కృష్ణమాచారి, రాఘవాచారి, జనార్ధనా చారి, రాజమహేంద్ర చారి, రాకేష్ చారి, నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *